న్యూఢిల్లీ, జూలై 18: ఆన్లైన్లో ఆదాయ పన్ను రిటర్న్స్-2 (ఐటీఆర్-2) ఫారాన్ని దాఖలు చేసే సదుపాయాన్ని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ కల్పించింది. పన్నుసహిత మూలధన లాభాల ఆదాయం కలిగిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి (2025-26 మదింపు సంవత్సరం)గాను ఐటీఆర్-2 ఫారాన్ని తమ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమర్పించవచ్చని శుక్రవారం ఎక్స్‌లో ఐటీ శాఖ తెలియజేసింది. గత నెల జూన్‌లో చిన్న, మధ్యశ్రేణి ట్యాక్స్‌పేయర్స్ కోసం సరళతరమైన ఐటీఆర్-1, 4 ఫారాలను ఆన్లైన్లో దాఖలు చేసే వీలును ఐటీ శాఖ కల్పించిన విషయం తెలిసిందే. కాగా, ఐటీఆర్ దాఖలుకున్న గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పొడిగించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఐటీఆర్-2 ఫారాన్ని ఐటీ శాఖ అందుబాటులోకి తేవడంతో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ మరింత ఊపందుకోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.