ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రూపొందించిన జీశాట్ ఎన్2 ఉపగ్రహాన్ని స్పేస్ఎక్స్ సంస్థ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫోరిడాలోని కేప్ కెనవెరాల్ ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మూసుకెళ్లింది. వాణిజ్యపరంగా స్పేస్ఎక్స్ సంస్థతో ఇస్రో ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. ఇస్రో ఇటీవల విజయవంతంగా పలు ప్రయోగాలు నిర్వహించింది. జీశాట్ ఉపగ్రహం కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఎందుకు స్పేస్‌ఎక్స్‌పై ఇస్రో ఆధారపడిందని చాలామంది ఆరా తీస్తున్నారు. అయితే, ఇందుకు కారణాలు ఉన్నాయని ఇస్రో మాజీ చైర్మన్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సమాధానం ఇచ్చారు. ఇస్రో వద్ద 4వేల కిలోల కంటే ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు తగిన సామర్థ్యం లేదని.. దాంతో భారత్ కొత్త కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్ ఎన్2 ప్రయోగం కోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌పై ఆధారపడాల్సి వచ్చిందని ఇస్రో మాజీ చీఫ్‌లు తెలిపారు.
4,700 కిలోల బరువున్న జీశాట్ స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్ భారత్‌లోని వివిధ ప్రాంతాలలో విమాన ప్రయాణ సమయంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు, ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరిచనున్నది. ఇస్రో ప్రయోగ వద్ద ఉన్న రాకెట్ల కన్నా ఉపగ్రహం బరువు ఎక్కువగా ఉండడంతో ఇతర సంస్థల నుంచి రాకెట్‌ని నింగిలోకి పంపినట్లుగా ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్ తెలిపారు. ఇస్రోకు నాలుగు టన్నుల వరకు బరువున్న ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి మోసుకువెళ్లగలుగుతాయని.. కొత్త జీశాట్ బరువు 4.7టన్నులు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఇస్రో రాకెట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఇస్రో మాజీ చీఫ్ జీ మాధవన్ నాయర్ మాట్లాడుతూ, 4.7 టన్నుల భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి భారతదేశానికి మరింత ప్రయోగ సామర్థ్యం అవసరమన్నారు. తర్వాతి తరం రాకెట్ల కోసం ఇస్రో ప్రయత్నాలు చేస్తుందన్నారు.