ISRO | చంద్రయాన్-3 నుంచి భారీ విషయాన్ని ఆశిస్తున్నట్లు ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ అన్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై విజయవంతంకావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షంలో విస్తరించి దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడమే ఇస్రో లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు భారత్ మరిన్ని గ్రహాలపై మిషన్లను ప్రారంభించే సామర్థ్యాన్ని కలిగి ఉందని మీడియాకు తెలిపారు. ఇస్రో ప్రధాని దార్శనికతను అమలు చేయగలుగుతోందన్నారు. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌కు సంబంధించి అన్నీ వందశాతం కరెక్ట్‌గా ఉన్నాయని చెప్పారు. ఇస్రోను చూసి దేశం మొత్తం గర్విస్తోందని, దేశప్రజలు తమకు మద్దతు ఇస్తున్నారన్నారు. ఈ చారిత్రాత్మక మిషన్‌లో భాగమైనందుకు తనతో పాటు సహోద్యోగులందరూ గర్విస్తున్నారన్నారు.
అంగారకుడితో సహా శుక్రుడిపై పరిశోధనలు చేపట్టగలమని, ఇందుకు మరింత విశ్వాసం పెట్టుబడులు అవసరమన్నారు. స్పేస్ సెక్టార్లో విస్తరించి.. భారతదేశాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందన్నారు. చంద్రుడికి సంబంధించి రోవర్ పంపే మరిన్ని చిత్రాల కోసం ఇస్రో బృందం ఎదురుచూస్తోందని, ప్రస్తుతం చంద్రుడిపై శాస్త్రీయ అధ్యయనం, పరిశోధనలపై ఎక్కువ దృష్టి పెడుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య ఎల్-1 మిషన్‌పై స్పందిస్తూ.. సెప్టెంబర్ మొదటి వారంలో లాంచ్ చేసే అవకాశం ఉందన్నారు. అయితే, లాంచ్‌కు సంబంధించి తుది తేదీని ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. ఆదిత్య ఎల్-1 మిషన్‌ను నింగిలోకి పంపాక.. లాగ్రాంజ్ పాయింట్‌కు చేరుకునేందుకు 125 రోజులు పడుతుందని సోమ్‌నాథ్ వివరించారు.