బెంగళూరు, జూన్ 8: గగన్యాన్ ప్రాజెక్టు విషయంలో తొందరపడొద్దని తాము నిర్ణయించినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం వెల్లడించారు. దేశం చేపడుతున్న మొదటి మానవ సహిత వ్యోమ నౌక ప్రయోగం కచ్చితంగా సురక్షితంగా జరగాలని, విజయవంతం కావాలనేదే తమ ప్రాథమిక లక్ష్యమని ఆయన తెలిపారు.
గగన్యాన్ తుది ప్రయోగానికి ముందు ఎనిమిది ప్రధాన పరీక్షలు జరపాల్సి ఉన్నదని, ఈ పరీక్షలన్నీ విజయవంతమైతే 2024 – 25 మధ్య ప్రయోగం ఉంటుందని తెలిపారు. అయితే, ఈ క్రమంలో సవాళ్లు ఎదురుకావడం సాధారణమేనని, ఇలాంటి పరిస్థితుల్లో కొంత ఆలస్యం కావచ్చని చెప్పారు. దేశ మొదటి సోలార్ మిషన్ ఆదిత్య – ఎల్1 ప్రయోగం ఈ ఆగస్టు లేదా వచ్చే ఏడాది జనవరిలో ఉంటుందని తెలిపారు. జూలై మధ్యలో చంద్రయాన్ – 3 ప్రయోగం ఉం టుందని వెల్లడించారు.