న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ సైంటిస్టులు కొత్త విషయాన్ని కనిపెట్టారు. శరీరంపై ఏర్పడే వాపులు లేదా గాయాల నుంచి చాలా మంది తమ దృష్టిని వేరే వాటిపైకి బలవంతంగా మళ్లిస్తారు. ఆ వాపులు, గాయాల మీద మనసు కేంద్రీకరించరు. ఇలా చేయడం వల్ల చాలామంది రిలీఫ్ దొరుకుతుందని అనుకుంటారు. కాని అది నిజం కాదని బార్-ఇలాస్ యూనివర్సిటీకి చెందిన న్యూరో సైంటిస్ట్ లిరోస్ రోజెస్క్రాంట్జ్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం తెలిపింది.
సాధారణంగా వాపు లేదా గాయాలు అయినప్పుడు అక్కడ మన శరీర రోగనిరోధక శక్తి చురుగ్గా పనిచేస్తుందని.. ఎక్కువ కణాలు అక్కడకు వెళ్లి చెడు కణాలతో యుద్ధం చేస్తుంటాయని.. అలాంటి సమయంలో వాటిపై మన దృష్టిని ఉంచాలని వారు చెప్పారు. తాము ముందుగా ఒక 30 మందిని ఇలా చర్మంపై వాపు లేదా చిన్న గాయం అయిన వారిని దానిపై దృష్టి పెట్టమని చెప్పి ఫలితాన్ని పరీశీలిస్తే చాలా త్వరగా నయం అవుతున్నట్టు తెలిసిందన్నారు. ఇంకో 20 మందిని గాయాల నుంచి దృష్టిని మళ్లించి వేరే వాటిపై కేటాయిస్తే ఫలితం తక్కువగా ఉందన్నారు. కాబట్టి కేవలం చికిత్స మాత్రమే కాకుండా మన మనసును కేంద్రీకరించడం కూడా ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.