Nitin Gadkari : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రిటైర్ అవ్వబోతున్నారా..? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు సంకేతమేనా అనే చర్చ జరుగుతోంది. దీనిపై ఆయన కార్యాలయం స్పందించి, స్పష్టతనిచ్చింది. రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నారనే ప్రచారంలో నిజం లేదని వెల్లడించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గత ఆదివారం, ఆగష్టు 23న తన సొంత ప్రాంతమైన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇది లక్ష్మణ్‌రావ్ మన్కర్ ట్రస్ట్‌కు సంబంధించిన కార్యక్రమం. ఈ ట్రస్టును గడ్కరీ స్థాపించారు. ఇది ఎకాల్ విద్యాలయాస్ పేరుతో గిరిజన ప్రాంతాల్లో విద్యాసంస్థల్ని నిర్వహిస్తుంటుంది. ఈ ట్రస్టుకు సంబంధించిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడారు. ‘‘నేను ఎంతో కాలం పని చేయలేను. కాబట్టి, యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు చాలా మంది యువత ఉన్నారు. పెద్దవారు వారికి మార్గనిర్దేశకత్వం చేస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు. తాను ఎక్కువ కాలం పని చేయలేనని, కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.
రాజకీయాల నుంచి నితిన్ గడ్కరీ తప్పుకోవాలి అనుకుంటున్నారని, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని, మంత్రి పదవి నుంచి తప్పుకొంటారని ప్రచారం మొదలైంది. పైగా.. త్వరలో మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రివర్గంలో జరగనుందనే ప్రచారం కూడా తోడైంది. దీంతో కొత్త మంత్రివర్గంలో గడ్కరీకి చోటు ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది. అయితే, ఈ అంశంపై ఇప్పుడు గడ్కరీ కార్యాలయం స్పందించింది. ఆయన రాజకీయాల నుంచి తప్పుకొంటారు అనే ప్రచారంలో నిజం లేదని వెల్లడించింది.
గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఆయన ట్రస్టుకు వర్తిస్తాయని, రాజకీయాలకు కాదని పేర్కొంది. తన ట్రస్టు వ్యవహాల్ని యువతకు ఇవ్వాలనుకుంటున్నారని స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రచారానికి తెరపడినట్లైంది.