న్యూఢిల్లీ : వ్యక్తి బరువు కాస్త అధికంగా ఉండటం వల్ల ఆయుష్సుకు ముప్పు ఉండకపోవచ్చు, కానీ చాలా సన్నంగా ఉండటం వల్ల ఆయుర్దాయానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 18.5 శాతం కన్నా తక్కువ ఉన్నవారు అర్ధాంతరంగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డానిష్ స్టడీలో వెల్లడైంది. ‘అధిక బరువు’గా వర్గీకరించిన బీఎంఐ కలిగిన వారిని తక్కువ బీఎంఐ కలవారితో పోల్చినపుడు, అధిక బరువు కలవారు తక్కువ బీఎంఐ కలవారితో సమానంగా కానీ, అంత కన్నా ఎక్కువగా కానీ మెరుగైన స్థితిలో ఉంటున్నట్లు వెల్లడైంది. అతి తక్కువ లేదా అత్యధిక బీఎంఐ కలవారు అర్ధాంతరంగా మరణించే ముప్పు అత్యధికంగా ఉంటుందని తెలిసింది. ఈ అధ్యయనం ప్రకారం బరువు తక్కువగా ఉండటం అత్యంత ప్రమాదకరం. బీఎంఐ 22.5-24.9 మధ్యలో ఉన్నవారి కన్నా బీఎంఐ 18.5 కన్నా తక్కువగా ఉన్నవారు అర్ధాంతరంగా మరణించే అవకాశం దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
బీఎంఐ 18.5-19.9 మధ్యలో ఉన్నవారు అకాల మరణంపాలయ్యే అవకాశాలు రెట్టింపు ఉంటాయి. అదేవిధంగా బీఎంఐ 20-22.4 మధ్యలోని వారికి ఈ ముప్పు 27 శాతం ఎక్కువ. సాధారణంగా 18.5-24.9 బీఎంఐ రేంజ్‌ని ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. అధిక బరువు, ఊబకాయంగా పరిగణించే బీఎంఐ 25-35 మధ్యలో ఉన్నవారు మరణించే అవకాశాలు రిఫరెన్స్ గ్రూప్‌తో పోల్చినపుడు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగలేదు. బీఎంఐ 40 లేదా అంతకన్నా ఎక్కువ గలవారు మాత్రం అకాల మృత్యువుపాలయ్యే అవకాశాలు 2.1 రెట్లు అని వెల్లడైంది. బరువు తక్కువగా ఉండటం ఆరోగ్యానికి హానికరమని, మరీ ముఖ్యంగా వృద్ధాప్యంలో ప్రమాదకరమని ఈ అధ్యయనం తెలిపింది. శరీరంలో కొంత కొవ్వు నిల్వలు ఉండటం వల్ల అస్వస్థతను తట్టుకునే సామర్థ్యం వస్తుంది.