Abhishek Bachchan | తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తేల్చేశారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేనే లేదన్నారు. త్వరలో అభిషేక్ బచ్చన్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఇటువంటి వదంతులు ఎలా వస్తాయో తనకు అర్థం కావడం లేదన్నారు. గతంలో తండ్రి అమితాబ్ బచ్చన్ పోటీ చేసిన స్థానం ప్రయాగ్ రాజ్ నుంచే అభిషేక్ బచ్చన్ పోటీ చేస్తారన్న ప్రచారం సాగింది. అఖిలేశ్ యాదవ్ సారధ్యంలోని సమాజ్ వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తారని ఊహాగానాలు కూడా సాగాయి.
1984లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు ప్రయాగ్ రాజ్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అమితాబ్ బచ్చన్ పోటీ చేసి ఘన విజయం సాధించారు. అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్ కూడా ఎస్పీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అభిషేక్ బచ్చన్ ను కూడా బరిలోకి తేవాలని ఎస్పీ నేతలు భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకు తనకు ఆసక్తి లేదని అభిషేక్ బచ్చన్ కొట్టి పారేశారు.