లక్నో: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (IRCTC) రైళ్లలో అమ్ముతున్న ఆహారం శుభ్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం ఓ ప్రయాణికుడు ముంబై నుంచి లక్నో వెళ్తున్న రైల్లో సమోసా కొనుగోలు చేశాడు. ఒకవైపు తుంచి కొద్దిగా తిన్నాడు. తర్వాత ఇంకొంచెం తుంచి షాకయ్యాడు. ఎందుకంటే ఆ సమోసాలో ఓ పసుపు రంగు కాగితం కనబడింది.
ఈ సమోసాను ఫొటో తీసుకున్న ప్రయాణికుడు అజి కుమార్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. నేను ఆదివారం లక్నోకు వెళ్తూ రైల్లో ఒక సమోసా కొన్నా. కొద్దిగా తిన్న తర్వాత దానిలో ఒక పసుపు రంగు కాగితం కనిపించింది. బాంద్రా-లక్నో రైల్లో (రైలు నంబర్ 20291) IRCTCకి చెందిన వ్యక్తి అమ్మిన సమోసా ఇది అని పేర్కొన్నాడు. దీనిపై IRCTC స్పందించింది.
మా వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. దయచేసి మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం అని తన రిప్లైలో పేర్కొన్నది. కాగా, దీనిపై ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. IRCTC తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. టికెట్ల బుకింగ్ మొదలు వాళ్లు ఏ పని చేసినా సక్రమంగా ఉండదని విమర్శిస్తున్నారు.