IRCTC New Rule | భారతీయ రైల్వేను దేశానికి జీవనాడిగా పేర్కొంటారు. ప్రస్తుతం రహదారులు, రోడ్నెట్వర్క్ వేగంగా విస్తరించినా.. నేటికీ సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరూ రైలులోనే ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఇష్టపడుతుంటారు. రైలు ప్రయాణం సురక్షితంగా ఉండడంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, రైలు ప్రయాణానికి ముందు తప్పనిసరిగా టికెట్ తీసుకోవాల్సిందే. ఇందు కోసం ఆన్లైన్ లేదంటే.. ఆఫ్‌లైన్‌లో రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ తీసుకుంటేనే బెర్తులు దొరుకుతాయి. లేకపోతే ఇబ్బందులుపడే అవకాశం ఉంటుంది.
గతంలో ఎక్కువ మంది టికెట్ల బుకింగ్ కోసం రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను ఆశ్రయించే వారు. పొడవైన క్యూలు ఉండడంతో చాలామంది ఆన్లైన్ టికెట్ బుకింగ్ వైపు దృష్టి పెడుతున్నారు. ఇంటి వద్దనే ఉండి టికెట్లు బుక్ చేసుకోవడం సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, భారతీయ రైల్వే టికెట్ క్యాన్సిల్‌కు సంబంధించిన రూల్స్‌ను మార్చింది. గతంలో కౌంటర్లో తీసుకు రైలు టికెట్‌ను క్యాన్సిల్ చేసుకునేందుకు తప్పనిసరిగా రైల్వే కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండేది. కానీ, ప్రస్తుతం భారతీయ రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆన్‌లైన్‌లోనూ కౌంటర్ టికెట్‌ను క్యాన్సిల్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నది. దాంతో ఇంటి నుంచే కౌంటర్ టికెట్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుకుందాం రండి..!
రైల్వే కౌంటర్ టికెట్ క్యాన్సిల్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉటుంది. అలా చేస్తే ఇంట్లో కూర్చొని టికెట్‌ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. కీలకమైన విషయం ఏంటంటే.. కౌంటర్ టికెట్ బుక్ చేసిన సమయంలో మీరు ఏ మొబైల్ నంబర్, ఆధార్‌కార్డ్ నంబర్ సరైనవి ఇచ్చి ఉండాలి. రెండింటిలో ఏది తప్పుగా ఇచ్చినా టికెట్‌ను రద్దు చేసుకునేందుకు రైల్వే కౌంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
రైల్వే టికెట్‌ను ఆఫ్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకునేందుకు మొదట ఐఆర్సీటీసీ (IRCTC) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఎడమ వైపున కనిపించే మెనూని క్లిక్ చేయాలి. అందులో ‘మోర్’ అని కనిపిస్తుంది.. దానిపై క్లిక్ చేయాలి. అందులో కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఓ విండో ఓపెన్ అవుతుంది. అందులో టికెట్ పీఎన్ఆర్ నంబర్, రైలు నంబర్, సెక్యూరిటీ క్యాప్చా కోడ్ నమోదు చేసిన సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే టికెట్ క్యాన్సిల్ అవుతుంది.
రైల్వే టికెట్ కౌంటర్‌ను ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ, రీఫండ్ కోసం మాత్రం సమీపంలోని రైల్వే టికెట్ కౌంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. టికెట్ కౌంటర్‌కు వెళ్లిన తర్వాత, మీరు క్యాన్సిల్ చేసుకున్న రైలు టికెట్ స్క్రీన్‌షాట్ చూపించాలి. దాంతో కౌంటర్లో ఉన్న సిబ్బంది పరిశీలించి టికెట్ డబ్బులను మీకు రీఫండ్ చేస్తారు. రీఫండ్ పొందేందుకు రైలు షెడ్యూల్ చేసిన సమయానికి కనీసం నాలుగు గంటల ముందు రైల్వే కౌంటర్‌కు వెళ్లాలి. రైల్వే కౌంటర్లో కొనుగోలు చేసిన టికెట్‌ను క్యాన్సిల్ చేసేందుకు ఐఆర్సీటీసీలో అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు.
అలాగే, ఆఫ్‌లైన్‌లో రైలు టికెట్‌ను బుక్ చేసుకున్న వారు.. బోర్డింగ్ పాయింట్‌ను సైతం ఆన్లైన్లో చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది రైల్వే. టికెట్ క్యాన్సిల్ తరహాలోనే ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌కు వెళ్లి.. మోర్ బటన్‌పై క్లిక్ చేయాలి. అందులో కౌంటర్ టికెట్ బోర్డింగ్ పాయింట్ ఛేంజ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పీఆర్ఆర్ నంబర్, రైలు నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలి. దాంతో టికెట్ బోర్డింగ్ పాయింట్ మారుతుంది. మొదట మీరు టికెట్ బుక్ చేసుకున్న బోర్డింగ్ పాయింట్ నుంచి కాకుండా.. మార్చుకున్న పాయింట్ నుంచే ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది.