ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur) మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ తెగకు చెందిన వాలంటీర్ గ్రూప్ అరంబాయ్ టెంగోల్ నాయకుడు కానన్ సింగ్‌ను పోలీసులు ఇంఫాల్‌లో శనివారం అరెస్టు చేశారు. దీంతో మెయితీ తెగకు చెందిన యువత పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగారు. షాపులను ధ్వంసం చేయడంతోపాటు రోడ్లపై టైర్లను కాల్చివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కానన్ సింగ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఇంఫాల్‌లోని క్వాకైథల్ ప్రాంతంలో తుపాకీ చప్పుళ్లు వినిపించాయని పలువురు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
కాగా, తాజా ఉద్రిక్తల నేపథ్యంలో శనివారం రాత్రి 11.45 గంటల నుంచి ఐదు లోయ జిల్లాల్లో ఇంటర్నేట్, మొబైల్ డేటా సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ఆంక్షలు ఐదు రోజులపాటు అమల్లో ఉంటాయని పేర్కొంది. శాంతిభద్రతల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేసినట్లు తెలిపింది.