హైదరాబాద్: ముగ్గురు పిల్లలను ఓ బైక్‌పై ఎక్కించుకుని వెళ్లే తల్లి దండ్రులను మనం ఇప్పటికీ చూస్తుంటాం. ఇలా దృశ్యమే భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా (Ratan Tata) కంట్లో పడింది. ముంబై వీధుల్లో తల్లిదండ్రుల మధ్య నలిగిపోతూ బైక్‌పై వెళ్తున్న పిల్లలను చూసిన ఆయన చలించిపోయారు. ఎలాగైనా సామాన్యులకు కూడా కారును అందుబాటులోకి తేవాలని, అదీ వారు కొనగలిగే ధరలోనే ఉండాలనుకున్నారు. తయారీ ఖర్చు ఎక్కువైనా వెనక్కి తగ్గలేదు. లక్ష రూపాయలకే ఓ మధ్య తరగతి కుటుంబానికి సరిపడేలా కారును తీసుకొస్తున్నామని ప్రకటించారు. అన్నట్టుగానే 2008లో జనవరి 10న ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తన కలల కారును ఆవిష్కరించారు. అదే టాటా నానో (Tata Nano)..
తొలి చూపులోనే ఆ కారు ఆకట్టుకోగలిగింది. అత్యంత చవకైన కారుగా అంతర్జాతీయ స్థాయిలో నానో వార్తల్లో నిలిచింది. 1930ల్లో ఫోక్స్‌వ్యాగన్, 1950ల్లో ఫియట్ కార్ల తరహాలో మార్కెట్లో ఇది అందరి నోళ్లలోనూ నానింది. తమ ఇంటికి ఆహ్వానించేందుకు చాలా మంది బుకింగ్‌లు చేసుకున్నారు. కొంత మంది తమ ఇంట్లో కారు ఉన్నప్పటికీ, నానోపై ఇష్టంతో బుక్‌చేసుకున్నారు. 2009లో మార్కెట్లో విడుదల చేశారు. ముందుగా ప్రకటించినట్లే రూ.లక్షకే దానిని అందించారు. తొలి బ్యాచ్‌గా తయారైన లక్ష నానో కార్లను లాటరీ పద్ధతిలో అమ్మారు. అప్పటికే కార్ల సరఫరా కంటే డిమాండ్ అధికంగా ఉండటంతో లాటరీ పద్ధతిని ఎంచుకున్నారు. అయితే తయారీ ఖర్చు అధికమైనప్పటికీ.. అన్న మాట ప్రకారం దానిని రూ.లక్షకే అందించారు. రానురాను విడిభాగాల ఖర్చు పెరగడంతో కారు ధరను కూడా కంపెనీ పెంచింది. తదనంతర కాలంలో కారుకు క్రమంగా డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తిని నిలిపివేశారు. క్రమంగా ఈ చిన్న కారు మార్కెట్లోకి రావడం బందైపోయింది. 2019లో నానో ప్రాజెక్టను కంపెనీ మూసివేసింది.
అయితే నానో కారుపై తనకున్న మక్కువను రతన్ టాటా పలుమార్లు వెల్లడించారు. 2022 మే 19న నానో కారులో ముంబైలోని తాజ్ హోటల్‌కు వెళ్లారు. ఇది భారతీయులందరికీ అందుబాటులో ఉండే కారు అని, పీపుల్స్ కారు అని తరచుగా చెప్పేవారు. కాగా, నానో ప్రయోగం విఫలమైందని ఒక ఇంటర్వ్యూలో ఆయన కూడా అంగీకరించారు. తాము చవకైన ధరకు మాత్రమే కారును తీసుకురావాలని అనుకోలేదు. అందరూ మెచ్చే, అందుబాటులో ఉండే కారును మేం తీసుకురావాలని అనుకున్నామని చెప్పారు.