భోపాల్: ఒక వ్యక్తి తన భార్యను కొట్టి చంపాడు. ఆమె మృతదేహాన్ని రోడ్డుపై పడేశాడు. రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు అసలుగుట్టును రట్టు చేశారు. (man kills wife, stages as road accident) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 12న కాంపు పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని షీట్లా రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ల మహిళ మరణించినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఆమె భర్త ప్రదీప్ గుర్జార్ స్వల్పంగా గాయపడినట్లు గమనించారు. రోడ్డు ప్రమాదంలో భార్య మరణించగా తనకు గాయాలయ్యాయని అతడు చెప్పగా పోలీసులు తొలుత నమ్మారు.
కాగా, మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రోడ్డు ప్రమాదం కాకుండా తీవ్రమైన దాడి వల్ల ఆమె మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. అలాగే కట్నం కోసం భార్యను ప్రదీప్ వేధిస్తున్నట్లు ఆమె కుటుంబం ఆరోపించింది.
మరోవైపు అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా టీవీలో నేర సీరియల్స్ చూసి భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించినట్లు తెలుసుకున్నారు. ప్రదీప్ కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి భార్య హత్యలో వారి సహకారంపై దర్యాప్తు చేస్తున్నారు.