ముంబై : వ్యక్తిగత-వృత్తిగత జీవితాల సమతుల్యతపై చర్చ జరుగుతున్న సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి సోమవారం మరింత వివరణ ఇచ్చారు. ఎక్కువ సేపు పని చేయాలని ఎవరినీ ఎవరూ అడగలేరన్నారు. సుదీర్ఘ సమయం పని చేయవలసిన అవసరం గురించి ఎవరికివారు ఆలోచించుకుని, అర్థం చేసుకోవాలని తెలిపారు.
వారానికి 70 గంటలు పని చేయాలని ఆయన గతంలో యువతకు ఇచ్చిన సలహాపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. “నేను ఉదయం 6.30 గంటలకు ఆఫీస్కు వెళ్లేవాడిని. రాత్రి 8.30 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి బయల్దేరేవాడిని. ఇది వాస్తవం. నేను దాదాపు 40 ఏళ్లపాటు అలా చేశాను. కాబట్టి, అది తప్పు అని ఎవరూ చెప్పలేరు” అన్నారు. నారాయణమూర్తి సోమవారం వార్షిక కిలాచంద్ స్మారకోపన్యాసంలో ప్రసంగించారు. అనంతరం అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ సమాధానం చెప్పారు.