ముంబై: కుమార్తె హత్య కేసులో ఆరేండ్లుగా జైలులో ఉన్న మీడియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జీ బాంబు పేల్చింది. తన కుమార్తె షీనా బోరా బతికే ఉన్నదని తెలిపింది. షీనా బోరాను జమ్ముకశ్మీర్‌లో కలిసినట్లు ఒక మహిళా ఖైదీ తనకు చెప్పినట్లుగా పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి ఇంద్రాణి ఈ మేరకు ఒక లేఖ రాశారని, ఈ విషయాన్ని నిర్ధారించాలని అందులో కోరినట్లు ఆమె తరుఫు న్యాయవాది సనా ఖాన్ గురువారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంద్రాణి బెయిల్ కోసం దరఖాస్తు చేస్తామని న్యాయవాది చెప్పారు. అయితే ఈ విషయాన్ని సీబీఐ సీరియస్‌గా పరిగణించడం లేదని తెలుస్తున్నది. కాగా, షీనా బోరా హత్య కేసు తొలి నుంచి పలు మలుపులు తిరుగుతున్నది.
ఇంద్రాణి ముఖర్జీ తొలి భర్త సంతానమైన 25 ఏండ్ల షీనా బోరా 2012 ఏప్రిల్ 24న కంపెనీ నుంచి సెలవు తీసుకుని అదృశ్యమైంది. ఆమె కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తన కుమార్తె అమెరికా వెళ్లినట్లుగా ఇంద్రాణి అందరితో చెప్పింది. కాగా, అదే ఏడాది మే 23న రాయ్‌గఢ్ జిల్లా అటవీప్రాంతంలో శిథిలమైన మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఇది జరిగిన మూడేండ్లకు 2015లో ఇంద్రాణి ముఖర్జీ కారు డ్రైవర్ శ్యామ్వర్ రాయ్‌ను అక్రమ ఆయుధాల కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా అదృశ్యమైన షీనా బోరా సంగతి వెలుగులోకి వచ్చింది. తాను, ఇంద్రాణి ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ కన్నా కలిసి షీనా బోరాను హత్య చేసి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పూడ్చినట్లు పోలీసులకు చెప్పాడు.
దీంతో 2015 ఆగస్ట్ 25న ఇంద్రాణి ముఖర్జీని, ఆ మరునాడు కోల్‌కతాలో ఉన్న మాజీ భర్త సంజీవ్ ఖన్నాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలో భార్య ఇంద్రాణికి సహకరించినట్లుగా వచ్చిన ఆరోపణలపై మూడు నెలల తర్వాత పీటర్ ముఖర్జీని కూడా అరెస్ట్ చేశారు.
2017లో ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఇంద్రాణి ముఖర్జీ రెండో పెండ్లి చేసుకున్న మీడియా సంస్థ యజమాని పీటర్ ముఖర్జీ కుమారుడితో తొలి పెండ్లి సంతానమైన కుమార్తె స్నేహంగా ఉండటంతోపాటు కొన్ని ఆస్తులకు సంబంధించిన వివాదం వల్ల షీనా బోరా హత్య జరిగినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 60 మంది సాక్షులను ప్రశ్నించింది.
కాగా, 2015లో అరెస్టైన ఇంద్రాణి ముఖర్జీ నాటి నుంచి ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నది. మరోవైపు జైలులో ఉండగానే ఇంద్రాణి, పీటర్ 2019 అక్టోబర్ 3న కోర్టు ద్వారా విడాకులు పొందారు. నాలుగేండ్లు జైలులో ఉన్న పీటర్ ముఖర్జీ 2020 మార్చి 20న బెయిల్‌పై విడుదలయ్యారు. మరోవైపు ఈ ఏడాది ఆగస్ట్ 17న డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ ఈ కేసులో అప్రూవర్‌గా మారాడు. దీంతో ఈ కేసులో తదుపరి దర్యాప్తును సీబీఐ ముగించింది.