శ్రీనగర్ : ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం మంగళవారం ఆకాశంలో తీవ్ర కుదుపులకు గురైంది. దీంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి ఎమర్జెన్సీ సంకేతాలు పంపించారు. శ్రీనగర్‌కు సమీపిస్తుండగా వడగండ్ల వాన పడింది. దీంతో 6ఈ2142 విమానం నోస్ కోన్ దెబ్బతింది.
విమానం సిబ్బంది చాకచక్యంగా శ్రీనగర్ విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు సురక్షితంగా దించగలిగారు. ఈ విమానంలోని ఓ ప్రయాణికుడు ఈ సంఘటనను వీడియో చిత్రీకరించారు. విమానం ప్రధాన భాగాన్ని వడగండ్లు తాకడం, క్యాబిన్ కుదుపులకు గురికావడం దీనిలో కనిపించింది. మరోవైపు ప్రయాణికులు తీవ్ర ఆందోళనతో ఏడుస్తూ, అరచినట్లు కనిపించింది.