న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభంపై ఇవాళ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. లోక్సభలో ఆయన ప్రకటన చేశారు. ఇండిగో ఆపరేషన్స్ మళ్లీ గాడిలో పడినట్లు చెప్పారు. ప్రయాణికుల భద్రతే ముఖ్యమని అన్నారు. ఆ సంక్షోభానికి ఇండిగో విమాన సంస్థదే బాధ్యత అని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో వేల సంఖ్యలో ఇండిగో విమానాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో వేల సంఖ్యలో ఇండిగో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర మంత్రి ప్రకటన చేశారు.
ఇండిగో సంక్షోభంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో సీఈవోకు షోకాజు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ప్రతి ప్రయాణికుడు సేఫ్గా ప్రయాణం చేయాలన్నారు. డీజీసీఏకు కూడా నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇండిగో సంస్థ ఇప్పటికే ప్రయాణికులకు 750 కోట్లు రిఫండ్ చేసిందన్నారు. కొత్త నిబంధనలు పాటిస్తామని ఇండిగో చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.