IndiGo : భారత విమానయాన సంస్థ ఇండిగో (IndIGo) ఇప్పుడిప్పుడే సంక్షోభం నుంచి తేరుకుంటోంది. పరిస్థితులు చక్కబడుతుండడంతో కొన్ని సర్వీస్‌లను పునరుద్దరిస్తోంది. అయితే.. పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు మాత్రం ఏర్పడలేదని చెప్పిన ఇండిగో యాజమాన్యం.. సంక్షోభానికి దారితీసిన ఐదు కారణాలను వివరిస్తూ సోమవారం కేంద్రానికి లేఖ రాసింది. ఇటీవల భారీగా సర్వీస్‌ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో తాజా లేఖలో ఏయే అంశాలను ప్రస్తావించిందంటే..?
భారీగా విమాన సర్వీస్‌ల రద్దుతో ప్రయాణికుల అవస్థలు గమనించిన కేంద్రం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సత్వరమే సమస్యకు దారితీసిన కారణాలను పేర్కొనాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. దాంతో.. ఇండిగో సంస్థ సోమవారం స్పందించింది. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా ఈ కారణాలను బహిర్గతం చేయడం లేదని సంస్థ తెలిపింది. విమాన సర్వీసులకు అంతరాయంతో, ఫ్లయిట్స్ రద్దుతో ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాం. ఒకటిరెండు కారణాలు కాదు.. దురదృష్టకరమైన కొన్ని పరిస్థితుల వల్ల సంక్షోభం ఏర్పడింది.
— IndiGo (@IndiGo6E) December 8, 2025
చిన్న చిన్న సాంకేతిక సమస్యలు, చలికాలం కావడంతో ఫ్లయిట్ల షెడ్యూల్ మర్చాల్సి రావడం, వాతావరణపరమైన సమస్యలు, విమానాశ్రయం నిర్వహణలో తలెత్తిన సమస్యలతో పాటు పైలట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ ప్రకారం.. పైలట్ విధులను అప్డేట్ చేయకపోవడం వంటివి సంక్షోభానికి దారి తీశాయి. అయితే.. సమ్యసకు ఫలానా కారణమే మూలమని ఇప్పటికిప్పుడే నిర్ధారణకు రాలేం అని ఇండిగో తమ లేఖలో వెల్లడించింది. అంతేకాదు సంక్షోభంపై స్పందించేందుకు తమకు డిజీసీఏ నియంత్రణ విభాగం 15 రోజుల గడువు విధించిందని, కానీ సమస్య మూలాల్ని అన్వేషించేందుకు మరింత సమయం పడుతుందని ఇండిగో పేర్కొంది.
— IndiGo (@IndiGo6E) December 8, 2025
ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సంక్షోభం కారణంగా డిసెంబర్ 3 నుంచి దాదాపు 2 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లో వందలాది మంది ప్రయాణికులు తమ ఫ్లైట్ ఎప్పుడు? అని లాంజ్‌లో గంటలకొద్దీ పడిగాపులు కాశారు. పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా మారడం.. కేంద్రం జోక్యంతో ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ (Pieter Elebers) ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Message from Pieter Elbers, CEO, IndiGo. pic.twitter.com/bXFdqoB0Q2
— IndiGo (@IndiGo6E) December 5, 2025
సంక్షోభానికి కారణాలేంటో తెలపాలని పౌరవిమానయాన శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించడంతో ఇండిగో లేఖలో పేర్కొంది. పరిస్థితులు చక్కబడుతుండడంతో శనివారం 1,500, ఆదివారం 1,650 విమానాలు నడిపింది. సంక్షోభం కారణంగా సర్వీస్‌ల రద్దుతో ఇబ్బందిపడిన ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించింది ఇండిగో. ఇప్పటివరకూ రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్టు సమాచారం.