indiGo | సంక్షోభంపై ఇండిగో సంస్థ మంగళవారం కీలక ప్రకటన చేసింది. విమాన సేవలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. విమానాలను సర్దుబాటు చేశామని, వెబ్సైట్లో పబ్లిష్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. విమానాలన్నీ క్రమం తప్పకుండా నడుస్తాయని కంపెనీ తెలిపింది. విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల లగేజీని వారికి అప్పగించామని.. మిగతా లగేజీని డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పింది. మంగళవారం కంపెనీ 1800 విమానాలను నడుపుతుందని ఇండిగో తెలిపింది. బుధవారం నుంచి 1900 విమానాలను నడిపేందుకు ప్లాన్ చేసింది. ఆన్ టైమ్ పనితీరు సైతం సాధారణ స్థితికి చేరుకుందని ఇండో పేర్కొంది.
ప్రయాణికుల కోసం పూర్తి రీఫండ్ ప్రక్రియను ఎయిర్‌లైన్ ఆటోమేటెడ్ విధానంలోకి మార్చింది. కంపెనీ వెబ్సైట్లో ఒక సాధారణ ప్రక్రియ ద్వారా పూర్తి చేయవచ్చని తెలిపింది. ప్రయాణికులు తప్పనిసరిగా ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందుగా వెబ్సైట్లో విమానం లెటెస్ట్ అప్డేట్ను తనిఖీ చేయాలని ఇండిగో విజ్ఞప్తి చేసింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై కంపెనీ విచారం వ్యక్తం చేసింది. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభం తర్వాత విమానయాన సంస్థ మళ్లీ తన కాళ్లపై నిలబడిందని తెలిపారు.
తమతో పాటు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారని.. వారికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొన్నారు. విమాన ప్రయాణం అందం ఏంటంటే.. ఇది ప్రజలు, భావోద్వేగాలు, ఆశయాలను ఒకే చోటకు చేర్చుతుందన్నారు. ప్రయాణికులంతా వివిధ కారణాలతో ప్రయాణిస్తుంటారని.. కానీ ఇందులో వేలాది మంది తమ ప్రయాణాలను కొనసాగించలేకపోయారని.. ఇందుకు హృదయ పూర్వక క్షమాపణలు కోరుతున్నానన్నారు. తాము విమానాల రద్దును నివారించలేకపోయామని.. తమ ఇండిగో బృందం కష్టపడి పని చేస్తుందని హామీ ఇస్తున్నామన్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడం తమ ప్రధాన ప్రాధాన్యత అన్నారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున రీఫండ్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
విమానాశ్రయాలలో చిక్కుకున్న లగేజీని ప్రయాణీకుల ఇండ్లకు డెలివరీ అవుతోందని.. మిగతా లగేజీని సైతం త్వరలో కస్టమర్ల ఇళ్లకు డెలివరీ చేస్తారన్నారు. కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు కట్టుబడి ఉన్నామని.. సంక్షోభం ఉన్నప్పటికీ తమ సేవలను వినియోగించుకుంటున్నారని.. విమానాలను బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. ఇది తమకు ప్రోత్సాహకరంగా ఉందని.. తాము తప్పుల నుంచి పాఠాలను నేర్చుకున్నామన్నారు. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని.. ప్రభుత్వానికి తాము పూర్తిగా సహకారం అందిస్తున్నానని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో క్షమాపణలు స్వీకరించి.. తమకు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని ఎల్బర్స్ చెప్పుకొచ్చారు.
IndiGo Operations Normalised | A Message From Pieter Elbers, CEO, IndiGo pic.twitter.com/VVB2yTsIBy
— IndiGo (@IndiGo6E) December 9, 2025