న్యూఢిల్లీ, మే 23: విపత్కర పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ తన వక్రబుద్ధి చూపింది. భారీ వడగళ్ల వాన, తీవ్రమైన కుదుపులతో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన ఢిల్లీ-శ్రీనగర్ ప్రయాణికుల ఇండిగో 6ఈ 2142 విమానాన్ని తమ గగనతలం నుంచి ప్రయాణించడానికి అనుమతించాలని పైలట్ చేసిన అభ్యర్థనను పాకిస్థాన్ తిరస్కరించింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వివరించారు.
భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో పఠాన్‌కోట్ వద్ద వాతావరణంలో ఒక్కసారిగా పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. వడగళ్ల వానతో తీవ్ర కుదుపులకు లోనై విమానంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడటంతో ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. విమానం కాక్‌పిట్‌లోని పలు పరికరాలు పనిచేయకుండా పోయాయి. దీంతో ఒక దశలో ఈ విమానం నిమిషానికి 8,500 అడుగుల వేగం (సాధారణ వేగం 1500 నుంచి 3000)తో కిందకు జారడం ప్రారంభించింది. ఆ సమయంలో విమానంలో పలువురు టీఎంసీ ఎంపీలు సహా 220 మంది ప్రయాణికులు ఉన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో చేసిన అభ్యర్థనను మన్నించడంలో పాకిస్థాన్ మానవత్వాన్ని మరచింది.విమాన సిబ్బంది లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను నేరుగా కాంటాక్ట్ చేశారు. తమ విమానం అత్యవసర పరిస్థితుల్లో ఉందని, ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నారని, గాలుల నుంచి తప్పించుకోవడానికి తమను కొద్దిసేపు పాక్ గగనతలంలోకి అనుమతించాలని కోరగా, దానిని పాకిస్థాన్ తిరస్కరించింది. తర్వాత శ్రీనగర్ ఏటీసీ మార్గనిర్దేశంలో శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.