న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు(IndiGo fights) రద్దు అవుతున్న విషయం తెలిసిందే. ఆ సంక్షోభం ఇవాళ ఏడో రోజుకు చేరుకున్నది. వేలాది సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, శ్రీనగర్ సహా పలు ఎయిర్‌పోర్టుల్లో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో విపక్షాలు లేవనెత్తాయి. ఇండిగో సమస్యపై ప్రభుత్వం ఏం చేస్తుందో దేశ ప్రజలకు చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు .. ఇండిగో సంక్షోభంపై ప్రకటన చేయనున్నట్లు స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. సోమవారం లేదా మంగళవారం ఆ ప్రకటన ఉంటుందన్నారు.
లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గగోయ్ మాట్లాడుతూ.. పౌర విమానయాన శాఖ ఇండిగో సంక్షోభం గురించి వివరించాలన్నారు. చాలా రోజుల నుంచి విమానాశ్రయాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డయాలసిస్ పేషెంట్లు, పెండ్లిళ్లకు వెళ్లేవారు, వృద్ధులు.. ఎంతో మంది విమానాశ్రయాల్లో చిక్కుకుపోతున్నట్లు చెప్పారు. హవాయి చెప్పులు ధరించేవాళ్లు కూడా విమానాల్లో వెళ్తున్నారని అంటారని, కానీ ఇప్పుడు విమాన టికెట్ ధరలు టికెట్‌పై 20 వేలు పెరిగినట్లు ఆయన తెలిపారు. ఎయిర్‌పోర్టుల్లో కాఫీ రూ.250కి అమ్ముతున్నారని, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని కాంగ్రెస్ నేత గగోయ్ చెప్పారు. అయితే ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని ఆయన అడిగారు.
బెంగుళూరు, ఢిల్లీ నుంచి ఇవాళ సుమారు 250 ఇండిగో విమానాలను రద్దు చేశారు.