indiGo | దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నది. కార్యకలాపాలను వేగంగా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల సంక్షోభం నేపథ్యంలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది. కంపెనీ ఆదివారం సుమారు 1650కిపైగా విమానాలను నడుపుతుందని సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొంది. ఇండిగో బృందం క్రమంగా సేవలను పునరుద్ధరిస్తోందని, ప్రయాణీకులకు మెరుగైన అనుభవం అందించేందుకు ప్రతి స్థాయిలో పనిచేస్తోందని ఎల్బర్స్ తెలిపారు. రాబోయే రోజుల్లో కార్యకలాపాలు పూర్తి సాధారణ స్థితికి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దశలవారీగా పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. పైలట్ల కొరత, షెడ్యూల్లో అంతరాయం కారణంగా ఎయిర్‌లైన్ కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొన్నది.
అయితే, పరిస్థితి అదుపులో ఉందని.. విమానాల సంఖ్య పెరుగుతోందని యాజమాన్యం చెప్పుకొచ్చింది. అయితే, ఇండిగో దేశవ్యాప్తంగా 3వేలకుపైగా ప్రయాణికుల బ్యాగులను డెలివరీ చేసిందని పౌర విమానయాన మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రయాణికుల లగేజీని తిరిగి వారికి అందజేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొంది. దాంతో పాటు ఇండిగో ఇప్పటి వరకు రూ.610 కోట్లకుపైగా రీఫండ్స్‌ను ప్రాసెస్ చేసిందని మంత్రిత్వశాఖ పేర్కొంది. విమానాల రద్దు, ఆలస్యం తర్వాత ఈ మొత్తాన్ని ప్రయాణికులకు చెల్లించాలని మంత్రిత్వశాఖ ఆదేశించింది. విమానయాన సంస్థ ప్రయాణీకుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తుందని మంత్రిత్వశాఖ పేర్కొంటున్నది. మరో వైపు ఇండిగో పైలట్ల పేరుతో సోషల్ మీడియాలో ఓ బహిరంగ లేఖ వైరల్‌గా మారింది. సీఈవో పీటర్ ఎల్బర్స్ సహా పలువురు ఉన్నతాధికారులు విమానయాన సంస్థను పతనం అంచుకునకు నెట్టారని ఆరోపించారు.