దేశంలోనే అతిపిన్నవయస్కురాలైన మేయర్.. కేరళ అసెంబ్లీలోనే అతిచిన్న వయస్కుడైన ఎమ్మెల్యే స్టేజీ మ్యారేజీతో ఒక్కటయ్యారు. పెద్ద పదవుల్లో ఉన్నా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పూలదండలు మార్చుకుని వివాహ బంధంలోకి ఎంటరై, అందరికీ ఆదర్శంగా నిలిచారు.
తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ దేశంలోనే చిన్న వయస్కురాలైన మేయర్‌గా గుర్తింపు పొందారు. 21 ఏండ్ల వయస్సులోనే మేయర్ అయ్యారు. సచిన్‌దేవ్ కేరళ అసెంబ్లీలోనే అతిచిన్నవయస్కుడైన ఎమ్మెల్యే. బలుస్సేరి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఇద్దరూ సీపీఐ ఎం చిల్ట్రన్స్ ఆర్గనైజేషన్‌లో పనిచేసినప్పటినుంచి మంచి స్నేహితులు. ఎస్ఎఫ్ఐలోనూ కలిసి పనిచేశారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది మార్చి 6న ఏకేజీ సెంటర్ హాల్లో జరిగింది. కాగా, ఆదివారం అదే ఫంక్షన్హాల్లో దండలు మార్చుకుని పెళ్లిచేసుకున్నారు. ఈ వివాహానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
తమ వివాహం సందర్భంగా ఎలాంటి బహుమతులు స్వీకరించబోమని ఆర్య రాజేంద్రన్, సచిన్‌దేవ్ ముందే ప్రకటించారు. ఎవరైనా బహుమతులు ఇవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి లేదా రాష్ట్రంలోని అనాథ శరణాలయాలకు సహాయం చేయవచ్చని చెప్పారు. అత్యంత సాదాసీదాగా పెళ్లి చేసుకున్న ఈ నూతన వధూవరులను సీఎం పినరయి విజయన్‌తోపాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సహా దాదాపు రాష్ట్రంలోని సీపీఎం సీనియర్ నేతలంతా హాజరై, ఆశీర్వదించారు.