న్యూఢిల్లీ : కెనడా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకొనే భారత విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది శీతాకాలంలో మొత్తం దరఖాస్తుల్లో సగం వీసా తిరస్కరణకు గురి కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ధోరణికి కెనడాలో కఠినంగా అమలవుతున్న స్టడీ పర్మిట్ విధానం కారణమని చెప్పవచ్చు. తక్కువ ర్యాంక్ ఉన్న కళాశాలలు, తక్కువ కాల పరిమితి కలిగిన కోర్సులకు దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థుల(భారత్ సహా) వీసా దరఖాస్తుల్లో 80 శాతం వరకు తిరస్కరణకు గురవుతున్నాయి.
దీంతో ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గడంతో ఆ కాలేజీలు ఫీజును వాపస్ చేయడమో లేదా వాయిదా వేసుకొనే అవకాశం ఇవ్వడమో చేస్తున్నాయి. కెనడాలో చదువయ్యాక ఉద్యోగం సంపాదించుకోవడంలో కష్టాలు పెరుగుతున్నాయని.. ఇది కూడా భారత విద్యార్థుల దరఖాస్తులు తగ్గడానికి కారణమని నిపుణులు చెప్తున్నారు.