Indian Railways | యూజర్లకు ఐఆర్సీటీసీ షాక్ ఇచ్చింది. దాదాపు 2.5కోట్లకుపైగా ఐడీలను డీయాక్టివేట్ చేసింది. ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడు ఏడీ సింగ్ ప్రశ్నించారు. కోట్లాది మంది ఐఆర్సీటీసీ యూజర్ల ఐడీలను ఎందుకు మూసివేశారని, టికెట్ల బుకింగ్ అయిన వెంటనే కోట్లాది టికెట్లు ఎలా అందుబాటులో లేకుండా పోతున్నాయని.. ఈ విషయంలో రైల్వే ఏం చర్యలు తీసుకుందని ఆయన రైల్వే మంత్రిత్వశాఖను ప్రశించారు. దీనికి రైల్వేశాఖ స్పందించంది. టికెట్ల బుకింగ్‌లో అక్రమాలను అడ్డుకునేందుకు 2.5 కోట్లకుపైగా యూజర్ ఐడీలను ఐఆర్సీటీసీ మూసివేసిందని తెలిపారు.
యూజర్ ఐడీలతో బుకింగ్ చేయడంలో ఏదో తప్పు జరుగుతుందని దర్యాప్తులో తేలిందని.. టికెట్ బుకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలు, దుర్వినియోగాన్ని ఆపేందుకు ఐఆర్సీటీసీ ఈ చర్యలు తీసుకుందని రైల్వేమంత్రిత్వశాఖ పేర్కొంది. డేటా విశ్లేషనలో కోట్లాది మంది యూజర్లు ఐడీలు ఫేక్ ఐడీలు, అనుమానాస్పద సమాచారంతో క్రియేట్ చేసినట్లు గుర్తించామని చెప్పింది. తత్కాల్ బుకింగ్‌లో పారదర్శకతను తీసుకువచ్చేందుకు.. నిజమైన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాటిని మూసివేసినట్లు పేర్కొంది. రైలు టిక్కెట్ల డిమాండ్ ఏడాది పొడవునా ఒకేలా ఉండదని మంత్రిత్వ శాఖ తెలిపింది.
టిక్కెట్ల డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్న సమయాలు ఉన్నాయని.. తక్కువగా ఉన్న సమయాలు ఉన్నాయని తెలిపింది. ఎక్కువ దూరం ప్రయాణించడానికి తక్కువ సమయం తీసుకునే రైళ్ల టిక్కెట్లు త్వరగా అమ్ముడవుతాయని.. కానీ ఇతర రైళ్ల టిక్కెట్లు సులభంగా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రయాణీకులు సులభంగా కన్ఫర్మ్ టికెట్లు పొందేలా, టికెట్ల బుకింగ్‌లో పారదర్శకత ఉండేలా.. ఎక్కువ మంది ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునేలా రైల్వేలు అనేక చర్యలు తీసుకున్నాయని తెలిపింది. వెయిటింగ్ లిస్ట్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారని, డిమాండ్ పెరిగితే ప్రత్యేక రైళ్లు నడుపడంతో పాటు ఉన్న రైళ్లకు అదనపు కోచ్‌లను జోడించనున్నట్లు చెప్పింది.
వెయిటింగ్ ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్లు పొందేలా వికల్ప్, అప్‌గ్రేడేషన్ స్కీమ్ వంటి పథకాలు అమలు చేరస్తున్నట్లు తెలిపింది. ప్రయాణీకులు ఆన్లైన్లో, రైల్వే కౌంటర్‌ను సందర్శించి టికెట్లు పొందవచ్చని మంత్రిత్వ శాఖ వివరించింది. ప్రస్తుత కాలంలో 89శాతం టికెట్లు ఆన్లైన్ బుకవుతున్నాయని పేర్కొంది. రైల్వేకౌంటర్లో డిజిటల్ చెల్లింపులు చేయవచ్చని చెప్పింది. జులై ఒకటి నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో మార్పులు చేశామని.. ఐఆర్సీటీసీ యాప్‌లో ఆధార్‌తో ధ్రువీకరించాలని.. అలాగే, ఏజెంట్లు తత్కాల్ టికెట్లను అరగంట తర్వాత చేసుకునేలా నిబంధనలు మార్చినట్లు వివరించింది.