Indian Railway | భారతీయ రైల్వేల్లో ప్రయాణ విధానంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో స్లీపర్ క్లాస్ నుంచే రైల్వేకు ఎక్కువగా ఆదాయం వచ్చేది. ఆ స్థానాన్ని ప్రస్తుతం ఏసీ-3 టైర్ ఆక్రమించింది. గత ఐదు సంవత్సరాలుగా ఏసీ త్రీ టైర్ నుంచి రైల్వేల ఆదాయం భారీగా పెరిగింది. 2024-25లో రైల్వే అంచనా వేసిన మొత్తం ప్రయాణికుల ఆదాయం రూ.80వేల కోట్లలో రూ.30,089 కోట్లు.. దాదాపుగా 38శాతం థర్డ్ ఏసీ నుంచి వస్తుందని అంచనా. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 26 కోట్ల మంది ప్రయాణికులు (మొత్తం 727 కోట్లలో 3.5శాతం) మాత్రమే థర్డ్ ఏసీలో ప్రయాణిస్తున్నారు. అయినా.. థర్డ్ ఏసీ నుంచే రైల్వేకు అత్యధికంగా ఆదాయం సమకూరుతున్నది.
2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం.. 2024-25 సంవత్సరంలో భారతీయ రైల్వేలకు ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం రూ.80వేలకోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో థర్డ్ ఏసీ నుంచి రూ.30,089 కోట్లు రావొచ్చు. మరో వైసు స్లీపర్ క్లాస్ కేటగిరి నుంచి 19.5శాతం ఆదాయం వస్తుందని అంచనా. ఈ ధోరణి భారత్‌లో మారుతున్న ట్రెండ్‌ను సూచిస్తున్నది. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రయాణికులు సౌకర్యవంతమైన, మెరుగైన ప్రయాణానికి పెద్దపీట వేస్తున్నారు. దాంతో థర్డ్ ఏసీ నుంచి ఆదాయం పెరుగుతూ వస్తున్నది. గత ఐదు సంవత్సరాల్లో ఏసీ-3 టైర్ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నది. 201-20లో 11 కోట్లు ఉండగా.. 2024-25 నాటికి 26కోట్లకు పెరిగింది.
వార్షిక వృద్ధి రేటు 19శాతంగా ఉన్నది. అదేకాలంలో ఈ కేటగిరి చార్జీలు సైతం పెరిగాయి. డైనమిక్ ధరల నేపథ్యంలో చార్జీలు పెరిగాయి. కానీ, ఇతర ఏసీ కేటగిరిలతో పోలిస్తే మాత్రం చాలా తక్కువగా ఉంది. ఓ నివేదిక ప్రకారం.. 2019-20లో ఏసీ-3 టైర్ సగటు చార్జీ రూ.1,090 కాగా.. 2024-25 నాటికి రూ.1,171కి పెరిగింది. టికెట్ ధర 7.4శాతం పెరిగింది. మరో వైపు ఏసీ ఫస్ట్ క్లాస్‌లో చార్జీలు 25.38శాతం పెరిగాయి. ఏసీ చైర్‌కార్ టికెట్ల ధరలు 23.24శాతం, సెకండ్ ఏసీ ధరలు 18.22శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. 2019-20లో సెకండ్ ఏసీ చార్జీలు రూ.1,267 ఉండగా.. 2024-25 నాటికి రూ.1,498కి పెరిగింది.
ఇక స్లీపర్ క్లాస్‌లో ఆదాయం తగ్గుముఖం పట్టింది. 201-20 కొవిడ్ మహమ్మారికి ముందు రైల్వైల గరిష్ఠ ఆదాయం స్లీపర్ క్లాస్ నుంచే వచ్చింది. ఈ కేటగిరి నుంచి రైల్వేకు రూ.13,641 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం ప్రయాణికుల్లో దాదాపుగా 27శాతం వచ్చింది. కానీ, 2024-25 నాటికి రూ.15,603కే పరిమితమైంది. అంటే 19.5శాతం పరిమితమైంది. మరో వైపు స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే వారి సంఖ్య 37 కోట్ల నుంచి 38 కోట్లకు పెరిగింది.
ప్రస్తుతం ప్రయాణికుల అభిరుచి మారుతున్నది. దాంతో ప్రయాణికుల థర్డ్ ఏసీలో ప్రయాణానికి ఇష్టపడుతున్నారని డేటా పేర్కొంది. 2019-20లో మొత్తం ఏసీ కేటగిరిలో ప్రయాణికుల సంఖ్య 18కోట్లు. ఇది 2024-25 నాటికి 38కోట్లకు చేరింది. అంటే దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువగా ఉన్నది. మరోవైపు నాన్ ఏసీలో ప్రయాణికుల సంఖ్య 2019-20లో 790 కోట్లు కాగా.. 2024-25లో 688 కోట్లకు పడిపోయింది.
భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యానికి పెద్ద పీట వేస్తున్నది. దాంతో ప్రజలు మెరుగైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని టికెట్ల ధరలు ఎక్కువగా ఉన్నా.. టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మెరుగైన ప్రయాణానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో థర్డ్ ఏసీ భారతీయ రైల్వేకు లాభదాయకంగా మారింది. రాబోయే సంవత్సరాల్లో ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో రైల్వేకు మరింత ఆదాయం సమకూరనున్నది. ప్రస్తుతం రైల్వేశాఖ ఏసీ రైళ్లను ఎక్కువగా ప్రవేశ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నది.