Indian Navy | పొరుగుదేశాలైన చైనా, పాక్ నౌకాదళాలు సంయుక్తంగా విన్యాసాలు చేస్తున్నాయి. ఈ నేవీ విన్యాసాలపై భారత నౌకాదళం నిఘా వేసింది. ముఖ్యంగా చైనా నౌకలపై ఇండియన్ నేవీ ప్రత్యేకంగా కన్నేసింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం డ్రిల్ కోసం చైనా నౌకలు మలక్కా జలసంధి ద్వారా హిందు మహాసముద్రంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి అవన్నీ భారతదేశ రాడార్లోనే ఉన్నాయి. పాక్, చైనా నేవీలు కలిసి సీ గార్డియన్-3 పేరుతో భారీ విన్యాసాలను నిర్వహిస్తున్నాయి.
రెండుదేశాలు కలిసి ప్రత్యక్షంగా ఫైర్ డ్రిల్స్ చేపట్టనున్నాయి. దీని వెనుక ఉద్దేశం ఆయా దేశాల సముద్ర శక్తిని చూపించడమే. అయితే, హిందు మహాసముద్రంలో తన ఆధిక్యాన్ని పెంచుకునేందుకు చైనా నౌకాదళం నిరంతరంగా ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో హిందూ మహాసముద్రంలో చైనా నావికాదళం ఏదో ఒక సాకుతో గూఢచర్యానికి పాల్పడుతూ ఉంటుంది. గతేడాది హిందు మహాసముద్రంలో చైనా నిఘా, ఓషనోగ్రాఫిక్ సర్వే షిప్‌ల ఉనికిని గుర్తించిన విషయం తెలిసిందే. రీసెర్చ్ పేరుతో ఇటీవల శ్రీలంక కొలంబోలో చైనా నిఘా నౌకను నిలిపింది.
అరేబియా సముద్రంలోని కరాచీ తీరంలో చైనా, పాకిస్థాన్ నౌకాదళాలు విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అయితే, హిందూ మహాసముద్రంలో చైనా జలాంతర్గాములు నావిగేట్ చేసేందుకు వీలుగా నేవీ డ్రిల్స్ నిర్వహించినట్లు భావిస్తున్నారు. హిందు మహాసముద్రంలోని నీటి అడుగున నావిగేట్ చేసేందుకు మ్యాప్‌లను రూపొందించడానికి డేటాను సేకరిస్తోంది. దీనిపై భారత నౌకాదళం దృష్టి సారిస్తున్నది. చైనా క్రమం తప్పకుండా విన్యాసాలు నిర్వహిస్తుండడంతో పాటు నౌకాదళ స్థావరాలను నిర్మిస్తున్నది. అయితే, చైనా నుంచి వచ్చే ముప్పును దృష్టిలో ఉంచుకుని భారత నౌకాదళం సైతం డ్రిల్స్‌ను సైతం భారీగానే నిర్వహిస్తున్నది.