న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ సైనిక దాడుల్లో వంద మంది ఉగ్రవాదులు మరణించారు. అయితే దీనికి ప్రతిస్పందనగా గురువారం తెల్లవారుజామున భారత్లోని 15 నగరాలపై పాకిస్థాన్ దాడులకు ప్రయత్నించింది. భారత సైనిక దళాలు ధీటుగా తిప్పికొట్టినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. రష్యా తయారీ ఎస్-400 రక్షణ వ్యవస్థతో పాక్ క్షిపణులను మధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు మీడియాకు వివరించారు.
కాగా, ఇజ్రాయెల్ తయారీ హార్పీ డ్రోన్లను సరిహద్దుల్లో మోహరించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్ దాడులకు ఆ రీతిలోనే వీటితో సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. లాహోర్లోని వైమానిక రక్షణ వ్యవస్థతో పాటు రాడార్లను హార్పీ డ్రోన్లతో ధ్వంసం చేసినట్లు వివరించారు.
మరోవైపు భారత్ ఎదురుదాడిలో ధ్వంసమైన పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్ శిథిలాలను సేకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదులకు ఆర్థిక నిధులు, శిక్షణ ద్వారా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. ఈ ఆధారాలు దీనిని స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు.