LPG tanker : పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతల నడుమ భారత్ (India) కు భారీ ఊరట లభించింది. ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్న దేశానికి ఊపిరినిస్తూ.. 46,313 మెట్రిక్ టన్నుల ద్రవరూప పెట్రోలియం గ్యాస్ (LPG) తో ‘సర్వశక్తి (Sarv Shakti)’ అనే నౌక హోర్మూజ్ జలసంధి (Strait of Horumuz) ని సురక్షితంగా దాటి భారత్‌వైపు వస్తోంది. మే 2న జలసంధిని దాటిన నౌక ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ ఒమన్ (Gulf of Oman) లో ప్రయాణిస్తూ విశాఖపట్నం దిశగా వస్తోంది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ‘సర్వశక్తి’ నౌకలో 18 మంది భారతీయులతో సహా మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారు. ఈ నౌక మే 13న విశాఖపట్నం పోర్టుకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో జరిపిన ద్వైపాక్షిక చర్చల ఫలితంగానే ఈ నౌక ప్రయాణానికి మార్గం సుగమమైంది. ప్రయాణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నౌక తన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా ‘ఇండియా/ఇండియన్ సిబ్బంది’ అని నిరంతరం ప్రసారం చేస్తూ ముందుకు కదిలింది.
ప్రాంతీయ సంఘర్షణల నేపథ్యంలో గత రెండు వారాల్లో హోర్మూజ్ జలసంధిని దాటిన తొలి భారత అనుసంధాన ఇంధన ట్యాంకర్ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం పెర్షియన్ గల్ఫ్‌లో సుమారు 14 భారతీయ నౌకలు చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తున్నది. వాటిని కూడా సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి భారత అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ‘సర్వశక్తి’ రాకతో దేశీయ ఇంధన సరఫరాకు కొంతమేర ఉపశమనం కలుగనుంది.