BJP | ‘సింహం-మేక’ కథ గుర్తుందా? ఓ మేకపోతు దారితప్పి సింహం గుహలోకి పొరపాటున వెళ్తుంది. అయితే, అప్పుడే సింహం లోపలికి రావడాన్ని చూసిన మేక.. భయాన్ని పైకి కనిపించకుండా చీకట్లోనే ఉండి సింహాన్నే గద్దిస్తుంది. దీంతో ఏదో పెద్ద జంతువు అనుకొని భ్రమపడ్డ సింహం భయపడి పారిపోవడంతో.. బతుకు జీవుడా అంటూ మేక తప్పించుకొంటుంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఖరి సరిగ్గా ఇలాగే ఉంది. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్‌లో ప్రజాస్వామ్యం క్షీణించిందంటూ అంతర్జాతీయ నివేదికలు, సూచీలు మొత్తుకుంటున్నాయి. అయితే, అవన్నీ కుట్రపూరిత నివేదికలంటూ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్న కేంద్ర పెద్దలు.. లోలోపల మాత్రం భయపడుతూనే ఉన్నారు. భారత ర్యాంకు తగ్గడానికి గల కారణాలేంటో రహస్యంగా ఆరా తీస్తున్నారు. ఈ మేరకు బ్రిటీష్ డైలీ ‘ది గార్డియన్’ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను పిలుస్తారు. అయితే, ఈ ప్రతిష్ఠను అలాగే నిలుపుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అష్టకష్టాలు పడుతున్నది. దీనికి కారణాలు లేకపోలేదు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజాస్వామ్య సూచీల్లో భారత్ ర్యాంకు అంతకంతకూ పడిపోతున్నది. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై దాడులు పెరగడం, మైనారిటీలపై హింసకాండ కొనసాగుతుండటం, వాక్స్వాతంత్య్రం, హక్కుల ఉల్లంఘన పెరగడంతో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ‘ప్రజాస్వామ్య సూచీ’లో భారత్ 53వ స్థానానికి పరిమితమైంది. ఎలక్టోరల్ డెమొక్రసీ ఇండెక్స్‌లో 108వ స్థానానికి దిగజారింది. దీంతో సదరు సంస్థ భారత్‌లో ప్రజాస్వామ్యం క్షీణిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది.
భారత్ ‘ఓ పాక్షిక ప్రజాస్వామ్య దేశమ’ని అమెరికాకు చెందిన ఫ్రీడమ్ హౌజ్ సంస్థ అభివర్ణించింది. మోదీ హయాంలో ‘ఎన్నికల నియంతృత్వం’ పెరిగిపోయిందంటూ స్వీడన్‌కు చెందిన వీ-డెమ్ ఇన్స్టిట్యూట్ తేల్చిచెప్పింది. అయితే ఈ నివేదికలను, సూచీలను కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు బహిరంగంగా తోసిపుచ్చుతూనే ఉన్నది. తమకు సలహాలు ఇవ్వడం మానుకోండంటూ ఎదురుదాడులకు దిగింది కూడా. ఈ నివేదికలు కుట్రపూరితమైనవని విదేశాంగ మంత్రి జై శంకర్ ఎండగట్టడం కూడా తెలిసిందే. అయితే, పైకి నివేదికలను ఖండిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు పెద్దలు లోపల మాత్రం ఆందోళనతోనే భయంభయంగా ఉన్నారని ‘గార్డియన్’ వెల్లడించింది. ప్రజాస్వామ్య సూచీల్లో భారత్ ర్యాంకు దిగజారడానికి కారణాలను విశ్లేషించాలని బ్యూరోక్రాట్లతో కేంద్రం ఎప్పటికప్పుడు రహస్య సమావేశాలను నిర్వహిస్తున్నట్టు వివరించింది. 2021 నుంచి ఇప్పటివరకూ ఈ విషయంపైనే కనీసం నాలుగు రహస్య భేటీలు జరిగినట్టు పేర్కొంది. ఈ మేరకు పలువురు ఉన్నతాధికారులు వెల్లడించినట్టు తెలిపింది.
మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదం మీదే మా ప్రభుత్వం నడుస్తున్నది.
– అమెరికా పర్యటనలో మీడియా ప్రశ్నకు ప్రధాని మోదీ
భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటిది ప్రజాస్వామ్య సూచీలో భారత్ ర్యాంకు దిగజారడమా? ర్యాంకు మెరుగుపడేలా చూడండి.
– బ్యూరోక్రాట్ల రహస్య సమావేశంలో ప్రధాని మోదీ
ప్రజాస్వామ్యంపై వచ్చే నివేదికలను పైకి కొట్టిపారేస్తున్నట్టు ప్రకటనలు చేసినప్పటికీ, రహస్య భేటీల్లో దీనిపై ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన, భయం కనిపించేదని ఓ అధికారి పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటిది, ప్రజాస్వామ్య సూచీలో భారత్ ర్యాంకు దిగజారుతుండటంతో మోదీ ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ర్యాంకు మెరుగుపడాలని చెప్పేవారు’ అని ఆ అధికారి తెలిపారు. సూచీల్లో భారత్ ర్యాంకు పడిపోతే దేశ ప్రతిష్ఠ మసకబారుతుందని, అందుకే ప్రజాస్వామ్య సూచీలకు ప్రాధాన్యం ఇవ్వమనేవారని వెల్లడించారు. రాజకీయంగా భారత్ ప్రమాదకర దేశమని అభిప్రాయాలు వ్యక్తమైతే అంతర్జాతీయంగా పెట్టుబడులకు అడ్డంకి ఏర్పడుతుందని, అందుకే ఈ సూచీలను తేలిగ్గా తీసుకోవద్దంటూ గత ఫిబ్రవరిలో జరిగిన భేటీలో ప్రధానంగా చెప్పారని వివరించారు.
అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే భేటీల్లో ‘ప్రజాస్వామ్య సూచీ’ అంశం మీద జరిగే చర్చపై ఆయన అంతగా ఆసక్తి చూపించేవారు కాదని ఆ అధికారి తెలిపారు. ‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, 2020 అల్లర్లు, పౌరసత్వం తదితర అంశాలను ఆధారంగా చేసుకొనే ప్రజాస్వామ్య సూచీలు భారత్‌కు ర్యాంకులను తగ్గించాయి. ఈ సమాచారం హోం మంత్రిత్వ శాఖ దగ్గర ఉంటుంది. భారత్ ర్యాంకు తగ్గడానికి కారణాలు తెలుసుకోవాలంటే ఈ సమాచారాన్ని విశ్లేషించాలి. అయితే హోం శాఖ ఆ వివరాలను ఇవ్వట్లేదు. అలాంటప్పుడు.. కారణాలను ఎలా విశ్లేషించగలం? ర్యాంకును ఎలా మెరుగుపర్చగలం?’ అని ఆ అధికారి ప్రశ్నించినట్టు గార్డియన్ వివరించింది.