న్యూఢిల్లీ: సింధు నదీ జలాల ఒప్పందాన్ని(ఐడబ్ల్యూటీ) సవరించుకుందామని ప్రతిపాదిస్తూ భారత్ పాకిస్థాన్‌కు నోటీసు జారీ చేసింది. ఐడబ్ల్యూటీ విషయంలో భారత్-పాక్ మధ్య చాలా కాలం నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందం అమలు విషయంలో పాక్ మొండిగా వ్యవహరిస్తుండటంతో సింధు నదీ జలాల ఒప్పంద కమిషనర్ల ద్వారా ఈ నెల 25న నోటీసు పంపినట్టు శుక్రవారం అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం అమలుపై పరస్పర ఆమోదయోగ్యమైన రీతిలో ముందుకు సాగుదామని భారత్ పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను పాక్ బేఖాతరు చేస్తున్నది. 2017 నుంచి 2022 వరకు ఐదుసార్లు శాశ్వత ఇండస్ కమిషన్ సమావేశాలు జరిగినప్పటికీ ఈ అంశంపై చర్చించేందుకు పాక్ నిరాకరించింది. కిషన్ గంగా, రాటిల్ జల విద్యుత్తు ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు పాక్ మొండికేస్తున్నది. మధ్యవర్తిత్వ న్యాయస్థానం ద్వారా తమ అభ్యంతరాలను పరిష్కరించాలని ప్రతిపాదించింది.
దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భారత్.. ఈ వ్యవహారాన్ని తటస్థ నిపుణులకు అప్పగించాలని ప్రపంచ బ్యాంక్‌ను కోరింది. ఈ పరిణామాలపై 2016లో ప్రపంచ బ్యాంక్ స్పందిస్తూ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని భారత్, పాక్‌కు సూచించింది. అయితే, పాక్ ఒత్తిడి మేరకు ఇటీవల ప్రపంచ బ్యాంకు ఒకేసారి తటస్థ నిపుణుడి అభ్యర్థనతోపాటు మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియను ప్రారంభించింది. దీనిపై భారత్ స్పందిస్తూ.. ఒకే అంశంపై రెండు సమాంతర చర్యలు చేపట్టడం సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఇలాంటి ఉల్లంఘనల వల్లనే ఒప్పంద సవరణకు నోటీసు జారీచేయాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ అంశంపై 90 రోజుల్లోగా భారత్‌తో పాక్ చర్చలు జరపాల్సి ఉంటుంది.
ఏమిటీ ఒప్పందం?
సింధు నదీ జలాల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్, పాక్ 1960లో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం సింధు నదితోపాటు పశ్చిమ నదులైన జీలం, చీనాబ్ పాకిస్థాన్‌కు.. తూర్పు ఉప నదులైన రావి, బియాస్, సట్లెజ్ భారత్‌కు దక్కాయి. రెండు దేశాల మధ్య సహకారం కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటైంది. దీనికి బాధ్యులుగా ఉన్న ఇరు దేశాల కమిషనర్లు ఏటా రెండుసార్లు సమావేశమవుతారు. ఈ నదులపై నిర్మించిన ప్రాజెక్టులను సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీలు జరుపుతారు. ఈ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు విధాన బాధ్యతలు నిర్వహిస్తుంది. వివాదాలు తలెత్తినప్పుడు ఇరు దేశాలూ కోరితేనే జోక్యం చేసుకుంటుంది.