న్యూఢిల్లీ, డిసెంబర్ 27: భద్రతకు సం బంధించిన మౌలిక సదుపాయాలను బలోపే తం చేసేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) దేశంలో మొట్టమొదటిసారి బాంబు నిర్వీర్య పరికరాల్లో ప్రమాణాలను నిర్దేశించింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యర్థన మేరకు టెర్మినల్ బా లిస్టిక్ రిసెర్చ్ లేబరేటరీ ఐఎస్ 19445:2025 పేరిట కొత్త ప్రమాణాన్ని రూపొందించింది. భూమిలో అమర్చిన బాంబులు, మందుపాతరలు వంటి పేలుడు పదార్థాలను గుర్తించి సమర్థవంతంగా నిర్వీర్యం చేసేందుకు ఈ ప్రమాణం మార్గదర్శకాలుగా ఉంటాయి.
ఈ పరికరాలను సమీకరించే ఏజెన్సీలు, తయారీదారులు, పరీక్షించే సంస్థలు కొత్త ప్రమాణా న్ని స్వచ్ఛందంగా అమలు చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర వినిమయ వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే శనివారం తెలిపారు. కీలక సెక్యూరిటీ ఆపరేషన్స్‌లో చురుకైన పాత్ర పోషించే బాంబు నిర్వీర్య వ్యవస్థల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఇది దోహదపడుతుందని ఓ ప్రకటనలో తెలిపారు.
భారతీయ సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట్ర పోలీసులు, పౌర ఏజెన్సీలు పేలని బాంబులు, ఐఈడీలు, హ్యాండ్ గ్రేనెడ్ల నుంచి ముప్పును ఎదుర్కోవడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. బాంబ్ బ్లాంకెట్స్, బాంబ్ బాస్కెట్స్, బాంబ్ ఇన్హిబిటర్స్ పేరుతో బాంబు నిర్వీర్య వ్యవస్థలు పనిచేస్తున్నాయి. భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలు ఈ పరికరాలను తయారుచేస్తుండగా వీటిని ఉన్నత ప్రమాణాలతో ఉపయోగించాల్సి ఉంటుంది.