న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ.6,81,210.00 కోట్లను కేటాయించారు. దేశ ప్రాంతీయ భద్రతా ముఖ చిత్రం త్వరితగతిన మారుతుండటం, సాయుధ దళాల ఆధునీకరణను దృష్టిలో ఉంచుకొని ఈసారి రక్షణ రంగానికి కాస్త ఎక్కువగా బడ్జెట్ కేటాయించినట్టు కనిపిస్తున్నది.
తాజా కేటాయింపుల్లో రూ.1,92,387 కోట్లను మూల ధనంగా పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని కొత్త ఆయుధాలు కొనుగోలు, యుద్ధ విమానాలు, నౌకలు తదితర యుద్ధ సామగ్రి కొనుగోలుకు వినియోగించనున్నారు. ఇక రోజువారీ నిర్వహణ ఖర్చులు, జీతాల కోసం రూ.4,88,822 కోట్లను రెవెన్యూ వ్యయం కింద కేటాయించారు.