పుదుచ్చరి: భారత్ ఆకాంక్షలతో కూడుకున్న దేశమని, భాషల ఆధారంగా విభజన జరగడం సరికాదు అని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్(VP Dhankhar) తెలిపారు. దేశ భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకుని, భాషా వివాదం నుంచి బయటపడాలని ఆయన ప్రజల్ని కోరారు. జాతీయ విద్యా విధానం 2020ని కచ్చితంగా అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ విధానం విద్యా వ్యవస్థలో గేమ్‌ఛేంజర్‌గా మారుతుందన్నారు. పాండిచ్చరి వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు భాషలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. గత దశాబ్ధంలో అద్భుతమైన ప్రగతి జరిగిందని, దీని వల్ల భారత్ ఆకాంక్షల దేశంగా మారిందని ఆయన అన్నారు. భాషల ఆధారంగా ఎలా విభజిస్తారని ఆయన ప్రశ్నించారు. భాషల అంశంలో ఏ దేశం కూడా భారత్ అంత సంపన్నంగా లేవన్నారు. సంస్కృత భాషకు విశ్వవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉందని, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, పాలీ, ప్రాకృతి, బెంగాలీ, అస్సామీతో పాటు 11 క్లాసికల్ బాషలు ఉన్నట్లు చెప్పారు.
Our languages indicate inclusivity. What is responsible for inclusivity, can it be a premise of divisiveness?
No country in the world is as rich when it comes to languages as our Bharat. Sanskrit is important globally; we have Tamil, Telugu, Kannada, Malayalam, Odia, Marathi,… pic.twitter.com/d4A8sXqAI6
— Vice-President of India (@VPIndia) June 17, 2025
పార్లమెంట్లో 22 భాషల్లో చర్చలు చేపట్టేందుకు సభ్యులకు అవకాశం ఉందన్నారు. మన భాషలు సమగ్రతకు నిదర్శనమని, ఐకమత్యం కోసం సనాతనం అదే బోధిస్తుందని ధన్ఖర్ తెలిపారు. ఆత్మ పరిశోధన చేసుకోవాలని, దానికి తగినట్లు వృద్ధి కావాలన్నారు. మన లక్ష్యాలను తెలుసుకుని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, భాషా వివాదం నుంచి బయటపడాలని అన్నారు. ఎన్ఈపీ పాలసీని అమలు చేయాలని రాష్ట్రాలను కోరారు. మన అబ్బాయిలు, అమ్మాయిలు ఆ లబ్ధిని పొందాలన్నారు. రాజకీయ నాయకులు ఎన్ఈసీ పాలసీకి భంగం కలిగించవద్దు అన్నారు.