సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 18:55:48

ప‌లు ఘ‌ర్ష‌ణ పాయింట్ల నుండి భార‌త్‌, చైనా వెన‌క్కి!

ప‌లు ఘ‌ర్ష‌ణ పాయింట్ల నుండి భార‌త్‌, చైనా వెన‌క్కి!

ఢిల్లీ : రాబోయే కొద్ది రోజుల్లో వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ‌(ఎల్ఏసీ) వెంబ‌డి ఉన్న‌ ప‌లు ఘ‌ర్ష‌ణ పాయింట్ల నుండి భార‌త్‌, చైనా ద‌ళాలు వెన‌క్కి వెళ్ల‌నున్నాయి. తూర్పు ల‌ఢ‌క్‌లో ఆరు నెల‌ల క‌న్నా ఎక్కువ కాలం కొన‌సాగిన ప్ర‌తిష్టంభ‌న త‌ర్వాత ఈ చ‌ర్య ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల పురోగ‌తికి సూచ‌న‌గా తెలుస్తోంది. నవంబర్ 6న చుషుల్‌లో జరిగిన ఇరుపక్షాల మధ్య ఎనిమిది రౌండ్ల కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల అనంత‌రం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అనంత‌రం సంయుక్త ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో ఎల్ఏసీ వెంట‌ కొన్ని ఘర్షణ పాయింట్ల నుండి ఇరుపక్షాలు వెన‌క్కి వెళ్లే అవకాశం ఉందని, దశలవారీగా అమ‌లు చేసేందుకు గల పద్ధతులపై చర్చిస్తున్న‌ట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

చర్చలు, ఒప్పందాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చైనా కోరుకుంటున్నందున భారత్ ఈ విషయంపై జాగ్రత్తగా ముందుకు సాగుతోంద‌న్నారు. ఇరుపక్షాల మధ్య చర్చల నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆయా ప్రాంతాల్లో మోహ‌రించిన‌ ట్యాంకులు, సాయుధ వాహనాలను రాబోయే రోజుల్లో వెన‌క్కి పిలిచే అవ‌కాశం ఉంద‌న్నారు. కాగా 8వ రౌండ్ చర్చల అనంత‌రం ఇరుప‌క్షాలు చ‌ర్చ‌ల‌ను మ‌రింత‌ ముందుకు తీసుకువెళ్లాలంటే ప్రస్తుత ప్రతిపాదనలపై చర్యలు తీసుకోవాల్సి ఉంద‌న్నారు. భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతాలలో వెస్ర్ట‌న్ సెక్టార్‌లో వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఇరుపక్షాలు చాలా బ‌ల‌మైన నిర్మాణాత్మక అభిప్రాయాలను కలిగి ఉన్నాయ‌న్నారు.

చర్చలలో ఇరు దేశాల నాయకులు తీసుకున్న ముఖ్యమైన ఏకాభిప్రాయాన్ని హృదయపూర్వకంగా స్వాగ‌తించి అమ‌లు చేయాల‌న్నారు. తమ ఫ్రంట్‌లైన్ దళాలు సంయమనం పాటించాలని కోరాయి. సైనిక, దౌత్య మార్గాల ద్వారా చ‌ర్చించేందుకు ఇరువురు అంగీకరించారు. స‌మావేశాల ద్వారా చ‌ర్చ‌ల‌ను ముందుకు తీసుకువెళుతూ సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత నెల‌కొనేలా అదేవిధంగా ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. త్వరలో మరో ద‌ఫా సమావేశం జరిపేందుకు కూడా అంగీకరించారని ప్రకటనలో ఆర్మీ వ‌ర్గాలు తెలిపాయి.