న్యూఢిల్లీ: అంతరిక్ష శాస్త్రవేత్తలకు కొత్త ఛాలెంజ్ విసిరారు ప్రధాని మోదీ. రోదసి అన్వేషణ చేపట్టాలని ఆయన కోరారు. మానవాళి భవిష్యత్తు కోసం అంతరిక్ష రహస్యాలను చేధించాలని ఆయన శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సందేశం వినిపించారు. ఆయన తన సోషల్ మీడియాలో ఇవాళ ఓ వీడియోను పోస్టు చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగాల కోసం ఆస్ట్రోనాట్ల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. యువత దీనిలో భాగం కావాలన్నారు. అతి సుదీర్ఘ దూరంలో ఉన్న గెలాక్సీలు, అంతరిక్షం అధ్యయనం చేయాలన్నారు. చంద్రుడి మీదకు, మార్స్ మీదకు వెళ్లామని, డీప్ స్పేస్ అంశంలో మరింత లోతుగా అన్వేషణ చేపట్టాలని, మానవాళికి ఉపయోగపడే అనేక రహస్యాలు అక్కడ ఉంటాయన్నారు.
అంతరిక్ష రంగంలో భారత్ ఒక్కొక్క మైలురాయి అందుకుంటోందని, ఇది దేశానికి గర్వకారణమన్నారు. నేషనల్ స్పేస్ డే సందర్భంగా.. అంతరిక్ష రంగంతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలు, యువతకు ఆయన విషెస్ తెలిపారు. సెమీ క్రయోజనిక్ ఇంజిన్లు, ఎలక్ట్రానిక్ ప్రొపల్షన్ లాంటి టెక్నాలజీ సంబంధిత అంశాల్లో భారత్ అత్యాధునికంగా దూసుకెళ్తోందన్నారు. భారత్ త్వరలో గగన్యాన్ మిషన్ను లాంచ్ చేస్తుందని, రాబోయే రోజుల్లో స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ఇండియా నిర్మిస్తుందని ప్రధాని చెప్పారు. భారత పరిపాలనా వ్యవస్థలో స్పేస్ టెక్నాలజీ అధిక భాగంగా మారిందన్నారు. పంట బీమా పథకాలు, మత్స్యకారుల రక్షణ, విపత్తు సహాయక చర్యలన్నీ ఇప్పుడు శాటిలైట్ ఆధారితంగా జరుగుతున్నట్లు ఆయన వెల్లడించా. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతి.. దేశ సాధారణ ప్రజల జీవితాలను మరింత సులభతరం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
Greetings on National Space Day! India’s journey in space reflects our determination, innovation and the brilliance of our scientists pushing boundaries. https://t.co/2XPktf49Ao
— Narendra Modi (@narendramodi) August 23, 2025