న్యూఢిల్లీ: భారత్‌లో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార, పోష్టికార భద్రతకు పరిష్కారాలు చూపేందుకు భారత్ పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 65 ఏళ్ల తర్వాత ఇండియాలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకానమిస్ట్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. సమగ్ర వ్యవసాయ విధానంపై 2024-25 కేంద్ర బడ్జెట్లో ఫోకస్ పెట్టినట్లు ప్రధాని మోదీ తెలిపారు. గతంలో ఇండియాలో ఈ సమావేశాన్ని నిర్వహించినప్పుడు, అప్పుడే భారత్ స్వతంత్య్రాన్ని సాధించిందని, ఆ సమయంలో దేశం వ్యవసాయ, ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొన్నదన్నారు.
ఇప్పుడు భారత్ ఆహార మిగులు దేశంగా మారిందన్నారు. పాలు, పప్పు దినుసులు, మసాలాలు ఉత్పత్తి చేయడంలో భారత్ నెంబర్‌వన్‌గా ఉందన్నారు. ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలు, దూది, చక్కెర, టీ పొడి ఉత్పత్తిలో ఇండియా రెండవ స్థానంలో ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఓ దశలో భారత ఆహార భద్రత విషయంలో ప్రపంచం ఆందోళన చెందినదని, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహారభద్రత, పౌష్టికార భద్రతకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు ఇస్తోందని మోదీ చెప్పారు.
రైతు ఆర్థికవేత్తలకు సదస్సుకు 70 దేశాలకు చెందిన వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆగస్టు రెండ నుంచి ఏడవ తేదీ వరకు ఈ సదస్సు జరగనున్నది. గడిచిన పదేళ్లలో విభిన్న వాతావరణాన్ని తట్టుకునే 1900 రకాల పంట వెరైటీలను భారత్ అభివృద్ధి చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. కెమికల్ ఫ్రీ నేచురల్ ఫార్మింగ్‌ను ఇండియా ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు.