న్యూఢిల్లీ, మే 25 : ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు, ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్, హమాస్-ఇజ్రాయెల్ యుద్ధాలు మొదలుకొని, మయన్మార్ అంతర్యుద్ధం, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల వరకు.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాలు యుద్ధ/ఘర్షణాత్మక పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీంతో భూమిపై దాదాపు సగం మానవాళి యుద్ధ సంక్షోభ పరిస్థితులను చవిచూస్తున్నదని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. గత ఏడాది కాలంలోనే 50 దేశాల్లోని 130 కోట్ల మంది ప్రజలు సాయుధ ఘర్షణల ప్రభావానికి గురైనట్టు స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థ ‘ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్, ఈవెంట్ డాటా’ (ACLED) తాజా నివేదికలో వెల్లడించింది. ఈ యాభై దేశాలకు గాను 10 దేశాల్లో అత్యంత విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని, 20 దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని తెలిపింది.
‘2024లో అత్యంత ప్రమాదకర సంక్షోభంలోకి పాలస్తీనా కూరుకుపోయింది. మయన్మార్లో సుమారు 170 సాయుధ గ్రూపులు క్రియాశీలంగా ఉన్నాయి. ఉక్రెయిన్లో భీకర పోరు సాగుతున్నది. ఇక 2025లో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరాయి’ అని ఏసీఎల్ఈడీ పేర్కొన్నది. 1960లో యుద్ధాలు/ఘర్షణల సంఖ్య 15గా, 1991లో ఆ సంఖ్య 53కు చేరుకుంది. అనంతరం 2013లో 30కి తగ్గగా, 2023లో మళ్లీ 59కి పెరిగింది. ఈ యుద్ధాలు/ఘర్షణల్లో మృతిచెందిన వారి సంఖ్య 1960లో 64 వేలు ఉండగా, 1990లో 80 వేలకు చేరుకుంది. 2005లో 12 వేలకు తగ్గగా, 2022లో ఏకంగా 2.77 లక్షలకు పెరిగింది.
ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హింస రికార్డు స్థాయికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా సగం జనాభా ఈ యుద్ధ ప్రభావాన్ని చవిచూస్తున్నది. పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడుతున్నట్టు కనిపించడం లేదు. యుద్ధం ప్రారంభమైన ఏడాదిన్నర తర్వాత.. తాజాగా గాజాపై గ్రౌండ్ ఆపరేషన్ను ఇజ్రాయెల్ మరింత ఉద్ధృతం చేసింది. ఇక శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో, ఉక్రెయిన్పై గత మూడేండ్లలో ఎన్నడూ లేనంతగా రష్యా వైమానిక దాడులకు దిగింది.