HMVP | న్యూఢిల్లీ:హ్యూమన్ మెటాన్యుమోనియా(హెచ్ఎంపీవీ)తో సహా చైనాలో ఇటీవల పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధుల కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం దేశ ప్రజలకు భరోసా ఇచ్చింది. చైనాలో పరిస్థితి అసాధారణమేమీ కాదని, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. పరిస్థితిని అంచనా వేసేందుకు సంయుక్త పర్యవేక్షణ గ్రూపుతో శనివారం సమావేశం నిర్వహించింది.
అనంతరం ఓ ప్రకటన విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్టు ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. హెచ్ఎంపీవీ వంటి వైరస్లు భారత్‌లో ఇది వరకు నుంచే వ్యాప్తిలో ఉన్నాయని, అటువంటి కేసులను సమర్థంగా ఎదుర్కోగల యంత్రాంగం తమకు ఉందని ఆరోగ్య శాఖ హామీ ఇచ్చింది. మరోవైపు చైనాలో పిల్లులు ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెర్టోనిటిస్ అనే ప్రాణాంతక వైరస్ బారిన పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పెంచుకుంటున్న కొందరు కొవిడ్‌కు వాడిన మందులను తమ పిల్లులకు వేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.