ముంబై: ముంబై సిటీలో ఇవాళ ఉదయం భీకరంగా వర్షం(Mumbai Rains) కురిసింది. కొన్ని గంటల పాటు నిరవధికంగా పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రైల్వే ట్రాక్‌లపై కూడా నీళ్లు నిలిచాయి. దీంతో రోడ్డు, లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెంట్రల్ రైల్వే నెట్‌వర్క్‌కు చెందిన మజిద్, బైకుల్లా, దాదర్, మాతుంగ, బద్లాపూర్ రైల్వే స్టేషన్లలో రైల్వే ట్రాక్‌లు నీట మునిగాయి. సబర్బన్ లోకల్ రైళ్ల వేగాన్ని తగ్గించి నడిపిస్తున్నట్లు సెంట్రల్ రైల్వే సీపీఆర్వో స్వప్నిల్ నీలా తెలిపారు.
ఛత్రపతి శివాజీ టర్మినస్ వైపు వెళ్తున్న రైళ్లు ఆలస్యంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. తమ కారిడార్‌లో వెస్ట్రన్ రైల్వే రైళ్లు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కింగ్స్ సర్కిల్, మంత్రాలయ, దాదర్ టీటీ ఈస్ట్, పారెల్ టీటీ, కాలాచౌకి, చించిపోకలి, దాదర్ స్టేషన్లలో నీళ్లు నిలిచాయి. ఆ రూట్లలో ట్రాఫిక్ జామైంది. నారీమన్ పాయింట్ ఫైర్ స్టేషన్ వద్ద అత్యధిక వర్ష పాతం నమోదు అయినట్లు బీఎంసీ తెలిపింది. అక్కడ 104 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
రుతుపవనాలకు చెందిన వర్షం కురవడంతో.. ముంబై సిటీకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షం వల్ల విమాన రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే ఛాన్సు ఉన్నట్లు ఎండీఐ అధికారులు హెచ్చరించారు. 17 రోజులు ముందుగానే రుతుపవనాలు సిటీకి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.