లక్నో: ఒక వ్యక్తి ఇంటి ఖర్చుల (household expenses) గురించి తన భార్యను అడిగాడు. దీంతో ఆగ్రహించిన ఆమె అతడ్ని కట్టేసి తన సోదరితో కలిసి దారుణంగా కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శివకుమార్ అనే వ్యక్తి బనారస్‌లో ఉంటున్నాడు. సోదరుడితో కలిసి కుల్ఫీ అమ్ముతున్నాడు. వచ్చిన డబ్బులను ప్రతి నెలా సొంతూరులోని తన భార్య సుశీలకు ఇంటి ఖర్చుల కోసం పంపుతున్నాడు.
కాగా, శివకుమార్ ఇటీవల బనారస్ నుంచి తన సొంతూరులోని ఇంటికి తిరిగివచ్చాడు. సుమారు 8 క్వింటాళ్ల గోధుమను భార్య అమ్మినట్లు తెలుసుకున్నాడు. తనకు చెప్పకుండా గోధుమలను అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే ఇంటి ఖర్చుల కోసం తాను పంపిన రూ.32,000లు ఏమయ్యాయని ప్రశ్నించాడు. ఆ డబ్బు దేనికి ఖర్చు చేసిందో చెప్పాలని నిలదీశాడు.
మరోవైపు ఇంటి ఖర్చుల గురించి అడిగిన శివకుమార్‌పై అతడి భార్య సుశీల ఆగ్రహం చెందింది. తన సోదరీతో కలిసి భర్తను కట్టేసింది. ఆపై కర్రతో దారుణంగా కొట్టింది. తీవ్రంగా గాయపడిన శివకుమార్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.