మొన్నటి వరకూ పంజాబ్ మాజీ సీఎం చెన్నీ వర్సెస్, పీసీసీ చీఫ్ సిద్దూ. ఒకరిపై ఒకరు మాటలతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం తేల్చే సరికి అధిష్ఠానానికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇప్పుడు మరో రాష్ట్రం తయారైంది. హర్యానా. పంజాబ్‌లో మాజీ సీఎం చెన్నీ వర్సెస్ సిద్దూగా నడవగా.. హర్యానాలో మాజీ సీఎం భూపేందర్ హుడా వర్సెస్ పీసీసీ చీఫ్ కుమారి షెల్జా మధ్య తీవ్ర పోరు సాగుతోంది. వీరిద్దరి మధ్య సాగుతున్న పోరుకు తెర దించడానికి కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. అయినా… ఇద్దరూ ఎక్కడా తగ్గడమే లేదు. ఎంతలా అంటే.. హర్యానా కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం భూపేందర్ హుడా వైపు ఉండగా… మరో వర్గం కుమారి షెల్జా వైపు నిలుస్తోంది.
ఈ ఇద్దరు నేతలు బహిరంగంగా విమర్శలకు దిగకపోయినా… లోలోపల మాత్రం ఒకరంటే ఒకరికి ఏమాత్రం పొసగడం లేదని పార్టీ నేతలు అంటున్నారు. ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడానికి కూడా ఇష్టపడటం లేదని సమాచారం. విపక్షం మీ ముందుకు అన్న కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తుండగా… కుమారి షెల్జా సంస్థాగత వ్యవహారాల్లో తలమునకలయ్యారు. ఇక… 31 మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్లలో కొందరు హుడాకు మద్దతిస్తున్నారు.
పీసీసీ పదవే వీరిద్దరి మధ్య చిచ్చుకు కారణం?
భూపేందర్ హుడా, కుమారి షెల్జా… ఇద్దరూ అధిష్ఠానానికి అత్యంత దగ్గరి వ్యక్తులే. భూపేందర్ హుడా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఇక.. కుమారి షెల్జా అధ్యక్షురాలు సోనియాకు అత్యంత సన్నిహితురాలు. అయితే.. పీసీసీ పీఠమే వీరిద్దరి మధ్య విభేదాలకు కారణంగా తెలుస్తోంది. ఈ సారి పీసీసీ పీఠం తన కుమారుడు దీపేంద్ర హుడాకు కట్టుబెట్టాలని భూపేందర్ హుడా అధిష్ఠానం ముందకు ఓ డిమాండ్ పెట్టారు. ఈ డిమాండ్‌కు సీనియర్లు కూడా మద్దతిస్తున్నారు. అయితే… మళ్లీ కుమారి షెల్జాకే పీసీసీ పీఠం ఇవ్వాలన్నది అధిష్ఠానం అభిమతంగా తెలుస్తోంది. ఈ పీసీసీ వివాదమే ఇద్దరి మధ్యా చిచ్చు పెడుతోందని తెలుస్తోంది.