Jungle warfare : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) లో గత నెల 22న ఉగ్రవాదులు (Terrorists) దట్టమైన అటవీ ప్రాంతాన్ని అవకాశంగా తీసుకొని పర్యాటకులపై దాడిచేసి 26 మందిని బలిగొనడంతో.. అలాంటి ఉగ్రదాడులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారిగా జమ్ముకశ్మీర్‌లోని పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సిబ్బందికి జంగిల్ వార్ఫేర్ (Jungle warfare) లో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించింది.
కశ్మీర్, ఇతర సరిహద్దు ప్రదేశాల్లోని పర్వత ప్రాంతాలు, ప్రమాదకరమైన అటవీ భూభాగాలపై అవగాహన ఉన్న ఉగ్రవాదులను ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రమాదకరమైన అటవీ ప్రాంతాల్లో పోలీసులకు యుద్ధ మెళకువల్లో శిక్షణనిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులకు శిక్షణనిచ్చే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, జమ్ముకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్‌కు అప్పగించినట్లు చెప్పారు. గతంలో ఎలైట్ యాంటీ-నక్సల్ గ్రేహౌండ్స్ కమాండర్‌గా పనిచేసిన ప్రభాత్ కశ్మీర్‌లోని ఎత్తైన ప్రదేశాల్లో సిబ్బందికి శిక్షణనిస్తున్నారు.
అధికారులు ఎస్ఓజీ బృందాలకు దేశంలోని ప్రమాదకర బహుళ ప్రదేశాలలో శిక్షణ ఇస్తున్నారు. కొన్ని బ్యాచ్‌లు ఇప్పటికే ముఖ్యమైన శిక్షణను పొందాయి. ఇందులో భాగంగా తెలంగాణలోని గ్రేహౌండ్స్, జంగిల్ వార్ఫేర్ స్కూల్, పంజాబ్‌లోని తల్వారాలోని వైట్ నైట్ కార్ప్స్ బేస్, కళ్మీర్లోని దోడాలోని కార్ప్స్ బాటిల్ స్కూల్స్ (CBS) లలో పలు సెషన్లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేంద్రాల్లో సిబ్బందికి రోజుల తరబడి ప్రతికూల పరిస్థితులలో జీవించడం, శత్రువులను ట్రాక్ చేస్తూ దట్టమైన అడవులను నావిగేట్ చేయడం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు.
విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలోని అన్ని ప్రదేశాలపై అవగాహన ఉండేలా మ్యాప్‌ల సహయంతో క్లిష్టమైన ప్రదేశాలకు త్వరగా చేరుకునేలా మెళకువలు నేర్పిస్తారు. అయితే పహల్గాం దాడి సమయంలో స్థానికంగా నిఘా వర్గాలు లేకపోవడం కూడా ఓ వైఫల్యంగా భావించిన అధికారులు మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ల ఏర్పాటుపైనా దృష్టి పెడుతున్నట్లు సమాచారం.