లక్నో: ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసులో బీజేపీ ఎంపీకి కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ నుంచి అనర్హత వేటు పడే అవకాశమున్నది. ఉత్తరప్రదేశ్‌లోని ఇతావా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రామ్ శంకర్ కటారియా (BJP MP Ram Shankar Katheria) 2011లో ఆగ్రాలోని విద్యుత్ సరఫరా కంపెనీ మేనేజర్‌పై తన అనుచరులతో కలిసి దాడి చేశారు. నాడు ఆగ్రా ఎంపీగా ఉన్న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, 12 ఏళ్ల నాటి దాడి కేసుపై ఆగ్రా కోర్టు విచారణ జరిపింది. రామ్ శంకర్ కటారియాను దోషిగా నిర్ధారించింది. రెండేళ్లు జైలు శిక్షతోపాటు రూ.50,000 జరిమానా విధించింది. శనివారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభకు అనర్హుడయ్యే అవకాశమున్నది.
మరోవైపు బీజేపీ ఎంపీ రామ్ శంకర్ దీనిపై స్పందించారు. కోర్టు తీర్పును గౌరవిస్తానని తెలిపారు. అయితే రెండేళ్ల జైలు శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన న్యాయ విధానాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.