న్యూఢిల్లీ, జూలై 2: పట్టణాల్లో ఉండే వాతావరణమే వేరు, అక్కడి పిల్లలు అన్నింటా ముందుంటారు..అనేది ఓ అపోహ మాత్రమేనని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. 1990 తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండ్ మారిందని, శారీరకంగా, మానసికంగా ఎదగటంలో గ్రామీణ ప్రాంత పిల్లలతో పోల్చితే పట్టణ ప్రాంత పిల్లలు వెనుకబడి ఉన్నారని ‘ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ అధ్యయనం పేర్కొంది. చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం, పరిస్థితులు ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనేది తెలుసుకునేందుకు తమ అధ్యయనం దోహదపడుతుందని పరిశోధకులు తెలిపారు.
ఈ నివేదిక ప్రకారం, 1990 ముందు దేశవ్యాప్తంగా పట్టణాల్లో పిల్లల్లో (5-19ఏండ్లు) శారీరక, మానసిక ఎదుగుదల, గ్రామీణ ప్రాంత పిల్లలతో పోల్చితే మెరుగ్గా ఉండేది. బలంగా, ఎత్తుగా ఉండేవారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి ఎంతో అవకాశముందని పట్టణాలకు వలసలు పెరిగాయి. అయితే 1990-2020 మధ్యకాలంలో పట్టణాల్లో పరిస్థితులు, వాతావరణం..పిల్లల ఎదుగుదల, అభివృద్ధికి దోహదపడలేదు. ఎత్తు, శారీరక బలం విషయంలో 2020 నాటికి గ్రామీణ పిల్లలు మెరుగ్గా ఉన్నారు. పట్టణ ప్రాంత పిల్లలు వెనుకబడిపోయారు.