Saharanpur : ఉత్తర ప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ఒక మసీదును అధికారులు కూల్చివేశారు. భారీ భద్రత నడుమ శనివారం ఈ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సహరన్పూర్ని కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ఒక మసీదు చాలా కాలంగా ఉంది. అయితే, ఆ మసీదు ఉన్న స్థలం ప్రభుత్వ భూమి. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ఈ మసీదు కొనసాగుతోంది. దీంతో ఈ మసీదును తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు ముస్లిం నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషనర్లకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమంగా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఈ మసీదును కూల్చివేసేందుకు గత జూలైలో అనుమతించింది. దీంతో ఈ ఆదేశాల్ని సవాలు చేస్తూ ముస్లిం సంఘాలు జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అక్కడ కూడా పిటిషనర్లకు ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సమర్ధించింది. మసీదు కూల్చివేసేందుకు అనుమతించింది.
ఈ మేరకు జిల్లా జడ్జి సతేంద్ర కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం రాత్రి మసీదును అధికారులు సీజ్ చేశారు. శనివారం మసీదును కూల్చివేసే చర్యలు చేపట్టారు. కలెక్టర్ కాంప్లెక్స్‌లోకి చేరుకున్న బుల్డోజర్లు మసీదును కూల్చివేశాయి. ఈ సమయంలో జిల్లా కలెక్టరేట్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు అక్కడే ఉన్నారు. మరోవైపు ఎటువంటి ఆందోళనలు తలెత్తకుండా కలెక్టరేట్ ప్రాంతంతోపాటు నగరంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ అంశంపై సహరన్పూర్ డీఐజీ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మసీదును తొలగించామన్నారు.
అయితే, మసీదు కూల్చివేతను అడ్డుకునేందుకు వెళ్లేందుకు సిద్ధమైన తనను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారని, సమాజ్‌వాదీ పార్టీ నేత, లోక్‌సభ ఎంపీ ఇర్కా హసన్ ఆరోపించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా గట్టి, భద్రత నడుమ ఈ కార్యక్రమం సాగింది.