మండి: కాంతితో విద్యుత్తును తయారు చేయాలంటే సూర్యుని కోసం వెదకనక్కరలేదు. ఇంటిలోని వెలుగు చాలంటున్నారు ఐఐటీ-మండి శాస్త్రవేత్తలు. సూర్యకాంతి లేకున్నా ఇంటిలోని ఎల్ఈడీ, సీఎఫ్ఎల్ లైట్ల కాంతితోనూ విద్యుచ్ఛక్తిని తయారు చేసే ప్యానెల్స్‌ను వారు కనిపెట్టారు. ‘సోలార్ ఎనర్జీ’ జర్నల్‌లో ఈ ప్రయోగ ఫలితాలను ప్రచురించారు. సోలార్ సెల్స్ సౌరకాంతిని వినియోగించుకొని విద్యుత్తు తయారు చేసుకుంటాయి. కానీ నాలుగు గోడల మధ్య సౌరకాంతి తక్కువగా ఉంటుంది.
ఇండోర్‌లో ఉపయోగించి సూక్ష్మ పరికరాలకు నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు కనీసంగా లభించే కాంతిని కూడా విద్యుత్తుగా మార్చే కొత్త ప్యానెల్స్‌ను ఐఐటీ-మండి శాస్త్రవేత్తలు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో రూపొందించారు. సౌరవిద్యుత్తు తయారీకి ఉపయోగించే పెరోవ్‌స్కైట్ పదార్థాల్లో సరికొత్త దాన్ని వారు తయారు చేశారు. దీనితో తయారైన ప్యానెల్స్ 34.07 శాతం సామర్థ్యంతో ఇండోర్ కాంతిని వినియోగించుకొన్నట్టు ప్రయోగాల్లో తేలింది. దీని సాయంతో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా కాంతి ఆధారిత విద్యుత్తును తయారు చేసుకోవచ్చని చెప్తున్నారు.