Irumudi | సినిమాకు సరైన కంటెంట్, బలమైన కథనం ఉంటే ప్రేక్షకులు ఎలాంటి విజయాన్ని అందిస్తారో ‘ఇరుముడి’ మరోసారి నిరూపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. ముఖ్యంగా సెకండ్ వీకెండ్లోనూ సినిమా జోరు తగ్గకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.సాధారణంగా ఏ సినిమా అయినా రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత వసూళ్లు, ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గుతుంటాయి. కానీ ‘ఇరుముడి’ విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. రెండో వారంలోకి వచ్చిన కొద్దీ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతున్నట్లు ఆన్లైన్ బుకింగ్స్ గణాంకాలు సూచిస్తున్నాయి.
ముఖ్యంగా రెండో ఆదివారం ఉదయం నుంచే ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో ‘ఇరుముడి’కి భారీ డిమాండ్ కనిపించింది. గంటకు ఏకంగా 20 వేలకుపైగా టికెట్లు అమ్ముడవుతుండటం విశేషంగా మారింది.రెండో వారంలోనూ ఇంతటి స్థాయిలో బుకింగ్స్ కొనసాగడం సినిమాకు ఉన్న మౌత్ టాక్‌కు నిదర్శనంగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా వీకెండ్లో భారీ సినిమాలకు మంచి స్పందన కనిపించినప్పటికీ.. సెకండ్ సండే నాటికి కూడా ఈ స్థాయిలో టికెట్ సేల్స్ కొనసాగడం ‘ఇరుముడి’కి కలిసొచ్చిన అంశంగా మారింది. విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ మార్కును దాటిన ఈ చిత్రం.. తొమ్మిది రోజుల థియేట్రికల్ రన్ పూర్తయ్యే సమయానికి ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్నట్లు సమాచారం.
మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లు అనే తేడా లేకుండా పలు ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఆక్యుపెన్సీ, బలమైన ఆన్లైన్ బుకింగ్స్‌ను చూస్తుంటే సినిమా లాంగ్ రన్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇరుముడి’ విజయానికి కేవలం స్టార్ హీరో ఇమేజ్ మాత్రమే కారణం కాదని.. సినిమాలోని కథ, భావోద్వేగాలు, కథనం ప్రధాన బలంగా నిలిచాయని ప్రేక్షకులు చెబుతున్నారు. శివ నిర్వాణ తనదైన శైలిలో కుటుంబ అనుబంధాలు, మన సంస్కృతి, భక్తి, భావోద్వేగాలను కమర్షియల్ అంశాలతో మేళవించిన తీరు ఆకట్టుకుంటోంది.ఇప్పటి తరం ప్రేక్షకులు ఎక్కువగా యాక్షన్, టెక్నాలజీ, రొమాన్స్, భారీ విజువల్స్ ఉన్న సినిమాల వైపు ఆకర్షితులవుతారనే అభిప్రాయం ఉంది. అయితే ‘ఇరుముడి’ మాత్రం ఈ అంచనాలను తలకిందులు చేస్తోంది.