Shock Syringe | ముంబై: వైద్యుడి దగ్గరకు వెళ్తే సూది ఇస్తాడేమో అనే భయం ఇక అక్కర్లేదు. సూది లేకుండా, నొప్పి తెలియకుండా ఇచ్చే పెయిన్లెస్ ఇంజెక్షన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఐఐటీ బాంబేకు చెందిన పరిశోధకులు ఈ షాక్ సిరంజీలను అభివృద్ధి చేశారు. చర్మాన్ని పదునైన సూదితో పొడవాల్సిన అవసరం లేకుండా షాక్వేవ్ ఆధారంగా ఈ సిరంజీ పని చేస్తుంది. షాక్ వేవ్‌ల ద్వారా ఒత్తిడిని కల్పించి, వెంట్రుక కన్నా సన్నగా ఉండే మొన(నాజిల్) ద్వారా వేగంగా శరీరంలోకి ఔషధాన్ని పంపించడం ఈ సిరంజీ ప్రత్యేకత.
విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ప్రయాణించే వేగం కంటే రెట్టింపు వేగంతో, సులభంగా ఇది ఔషధాన్ని శరీరంలోకి చేరుస్తుంది. దీని వల్ల నొప్పి కలగదు. వాపు లాంటి సమస్యలు ఉండవు. అనస్థీషియా, యాంటీఫంగల్, ఇన్సులిన్ అందించేందుకు ఎలుకలపై ఈ సిరంజీని పరీక్షించగా సమర్థంగా పని చేసింది. నాజిల్ మార్చుకుంటే ఒక్కో సిరంజీతో దాదాపు వెయ్యిసార్లు ఇంజెక్షన్లు ఇవ్వొచ్చు.