భువనేశ్వర్, ఆగస్టు 12: వర్షపాతాన్ని కచ్చితంగా అంచనావేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్టు ‘ఐఐటీ-భువనేశ్వర్’ ప్రకటించింది. వెదర్ రిసెర్చ్, ఫోర్కాస్టింగ్ (డబ్ల్యూఆర్ఎఫ్) మోడల్లో వచ్చిన అవుట్‌పుట్‌ను డీప్ లెర్నింగ్ మోడల్‌తో అనుసంధానం చేయటం ద్వారా కొత్త సాంకేతికతను రూపొందించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. పెద్ద ఎత్తున వరదలు సంభవించే అస్సాం, భారీగా వర్షాలు కురిసే ఒడిశాలలో కొత్త టెక్నాలజీ పనితీరును అధ్యయనం చేసినట్టు తెలిపింది.
బెంగళూరు, ఆగస్టు 12: ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈవోఎస్-08 ప్రయోగం వాయిదా పడింది. ఆగస్టు 16న ఈ ప్రయోగాన్ని చేపడుతున్నట్టు ఇస్రో సోమవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. 175.5 కిలోగ్రాములున్న ఈ శాటిలైట్ అంతరిక్షంలో ఒక ఏడాది కాలం తన సేవల్ని అందిస్తుంది. భూమిపై శాటిలైట్ ఆధారిత నిఘా, విపత్తు, పర్యావరణ పర్యవేక్షణ, అగ్ని ప్రమాదాలు, పరిశ్రమలు, విద్యుత్ ప్లాంట్లలో విపత్తుల నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని ఈవోఎస్-08 శాటిలైట్ అందిస్తుంది.